ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రఘురాం రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు.
అయితే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రఘురాం రెడ్డి ఆ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. నామినేషన్ దాఖలు చేసిన రఘురాం రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు.
అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చెక్ పెట్టేందుకు మంత్రి పొంగులేటి మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. తన భార్య నందిని కాకుంటే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని భట్టి డిమాండ్ చేసినట్లు సమాచారం.తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే రఘురాం రెడ్డికి ఇవ్వాలని మంత్రి పొంగులేటి కాంగ్రెస్ చీఫ్ వద్ద డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ ఒక్క సీటుతో మంత్రి పొంగులేటి… సీఎం రేవంత్‌రెడ్డికి చెక్ పెట్టారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సీటు విషయంలో మొదటి నుంచి ఎంతో పట్టుదలతో ఉన్న పొంగులేటి చివరికి తన పంతం నెగ్గించుకున్నారనే చర్చ జరుగుతోంది.
పొంగులేటి కుటుంబసభ్యులకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతగానో ప్రయత్నించినట్టు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం.
అయినప్పటికీ వాళ్లందరి అభిప్రాయాన్ని కాదని అధిష్ఠానం పొంగులేటి వియ్యంకుడికి టికెట్ ఇవ్వడం రాష్ట్ర పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డి ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టడమేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌కు ఓ హెచ్చరిక లాంటిదనే చర్చ జోరుగా జరుగుతున్నది.