రేవంత్‌ని అరెస్ట్ చేస్తే.. వారిద్దరినీ కూడా అరెస్ట్ చేయాలి: కూనంనేని సాంబశివరావు
ఖమ్మం జిల్లా: సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేస్తే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కూడా అరెస్టు చేయాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళల్లో ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడం మోదీకి ఆనవాయితీగా మారిందన్నారు. ఢిల్లీ పోలీసులతో రేవంత్‌రెడ్డికి నోటీసులు పంపడం సరైంది కాదన్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై సోషల్ మీడియాలో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేతలపై అసభ్యంగా మీమ్స్ చేశారని ఆరోపించారు.రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరి మోదీ, బీజేపీ నేతల మీద ఏ కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మే 2న పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.
ఈ సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరవుతారని తెలిపారు. మంగళవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ పూర్తి మద్దతు ఇచ్చిందని తెలిపారు.
ముఖ్యంగా దేశంలో ఏనాడు లేని విధంగా విద్వేష రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. మోదీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం దురదృష్టకరమని చెప్పారు. ఎన్నికల సమయంలో ఏదో ఒక సెంటిమెంట్‌తో మోదీ ప్రజల్లోకి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు.
గత ఎన్నికల్లో 2కోట్ల ఉద్యోగాలు, రైతులకు ఆదాయం పెంచుతామన్నారని.. వాటిని ఎందుకు అమలు చేయలేని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తిని.. ముస్లింలకు పంచేస్తారని మోదీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రాజనీతి లేని మోదీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉందని చెప్పారు. హిందూవులకు మంగళసూత్రం అంటే ఎంతో గౌరవమైందని.. మోదీకు మంగళసూత్రం విలువ తెలీదన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేశంలో గెలిచే పరిస్థితి లేదన్నారు. నరేంద్ర మోదీకి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతాననే భయం పట్టుకుందని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎవరినైనా అడ్డుకునే శక్తి కమ్యూనిస్టులకు ఉందని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లోతాము కీలక పాత్ర పోషిస్తున్నామని వివరించారు. ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వనని నరేంద్ర మోదీ కరాఖండిగా చెబుతున్నారన్నారు.
ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేసేలా మోదీ అండ్ కో వ్యవహారిస్తోందని ఫైర్ అయ్యారు. నిరంకుశత్వం పోకడలు పోతున్నబీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
బీజేపీ కేంద్రంలో మరోసారి గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.సీపీఐ, సీపీఎం పార్టీల మద్దతుతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థలు భారీ మెజార్టీతో గెలుస్తారని కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు..