
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఉత్తర వాయువ్య దిశలో కదిలే వాయుగుండం ఇవాళ(శుక్రవారం) దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్రకోస్తా తీరాన్ని దాటింది. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అక్కడక్కడ తేలికపాటి ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.
సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది.
మరోపైపు ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(శుక్రవారం) ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉన్న గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.
క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ.. బలహీనపడుతోందని పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుతం ఉత్తరకోస్తా జిల్లాల్లో.. వర్షం తగ్గుముఖం పట్టినట్లు సమాచారం.
అయితే.. రేపు(శనివారం) పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.