తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే
సి కే న్యూస్ (సంపత్) మే 05
తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే అదివారం నాడు ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ … మనిషి యొక్క నార్మల్ టెంపరేచర్ 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని, ఇప్పుడు వాతావరణము టెంపరేచర్ 46 డిగ్రీల సెల్సియస్ ఉందని,ఎండలో తిరిగితే ఈ వ్యత్యాసం వలన శరీరంలో టెంపరేచర్ పెరిగే క్రమంలో శరీరంలో ఉన్న ఖనిజ లవనాలు, నీరు ఆవిరైపోయి శరీరము డీహైడ్రేషన్ కు గురై వడ దెబ్బ తగులుతుందని, దీనివలన విపరీతమైన జ్వరము,తలనొప్పి,తల తిప్పటము,వికారము,వాంతులు,అంతేకాకుండా విపరీతమైన చెమటలు పట్టి చర్మం పొడిగా మారడము, తికమక పడటం, మూర్చపోవడము,నాడి బలహీనంగా కొట్టుకోవడం,బిపి తగ్గి దాహంతో నాలుక పిడచు కట్టడం,శరీరానికి కావలసిన నీరు తగినంత లభించక గుండె, మూత్రపిండాలు తమ పనులు నిర్వర్తించకుండా మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు.అందువలన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఎండలో తిరగవద్దని,రోజువారి పనిచేసే కూలీలు కానీ, వ్యవసాయదారులు కాని, వ్యవసాయ కూలీలు కానీ, కార్మికులు కాని,వ్యాపారస్తులు కాని ఉదయము 11 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత పనిచేసేటట్లుగా చూసుకోవాలని కోరారు. నీడ ప్రాంతంలో, చల్లని ప్రాంతంలో ఉండేటట్లు చూసుకోవాలని, ఎండలో పనిచేసేటప్పుడు తలకు గుడ్డ గాని, తలపాగ గాని, టోపీ గాని ధరించాలని.
ఎండకు వెళ్లే సమయములో గొడుగుతో వెళ్లాలని, కాళ్లకు చెప్పులు ధరించాలని, చల్లని నీరు, మజ్జిగ, నిమ్మరసము, కొబ్బెర నీళ్లు,ORS ద్రావణాలను వెంట ఉంచుకోవాలని,ఇవి అందుబాటులో లేనట్లయితే ఒక చిటికెడు ఉప్పు, స్పూన్ చక్కెర ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలని, వయసుతో నిమిత్తము లేకుండా ఎవరైనా ఎండకు వెళ్ళినట్లయితే వడదెబ్బకు గురికావాల్సి వస్తుందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.
ఇంట్లో తయారు చేసుకున్న ఆహార పదార్థాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలని, పాచి ఆహార పదార్థాలను,కుళ్ళిన ఆహార పదార్థాలను, కుళ్ళిన మాంసము మొదలైన బయటి కలుషిత ఆహార పదార్థాలు, హోటల్ ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచించారు.
వడదెబ్బ తగిలినట్లు అనిపిస్తే, మీకు అందుబాటులో ఉన్న ఆశా కార్యకర్త దగ్గర నుంచి కానీ, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నుంచి గాని, మెడికల్ షాపు నుంచి కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకొని స్వచ్ఛమైన నీటిలో కలుపుకొని తాగాలని,అవసరమైతే 108 కాల్ చేసి ఆసుపత్రికి పంపించాలని, అప్పటివరకు చల్లని నీరు,లేదా ఓఆర్ఎస్ ద్రావణం, లేదా మజ్జిగ, లేదా కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం తాగిస్తూనే ఉండాలని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకొని రక్షణ పొందాలని సూచించారు.