కూతురి ఆత్మహత్యాయత్నం.. భరించలేక తండ్రి బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిందని కూతురు పురుగుల మందుతాగి ఆత్మహత్యయత్న చేసింది. తన కూతురు బతుకుతుందో లేదని ఆందోళన చెందిన తండ్రి కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా దామోర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామక్రుష్ణపూర్ గ్రామంలో గాజా కుమారస్వామి, రమాదేవి దంపతులకు కూతురు ఉంది. ఆ యువతి ఇంటర్మీడియేట్ చదువుతోంది. గతేడాది ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో ఒక సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉంటుంది.
ఇప్పుడు మళ్లీ ఇంటర్ పరీక్షలు రాసింది. ఈ ఏడాది కూడా పరీక్షల్లో ఫెయిల్ అయ్యింది. పాస్ కాలేదనే మనస్తాపంతో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు, స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో తన తండ్రి కుమారస్వామి చికిత్స పొందుతున్న తన కూతురు బతుకుతుందో లేదో అని ఆందోళనకు గురయ్యాడు. ఈ ఆందోళనలో తన కుమార్తె బతకదని భావించి..తన బిడ్డలేని ప్రపంచంలో తాను బతకనని వ్యవసాయ భావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో ఆయన అక్కడిక్కడే మరణించాడు. ఈవిషయంపై మ్రుతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ విషయం తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.