బీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని అచ్చంపేట మండలం మన్నె వారి పల్లి గ్రామానికి సోమవారం మధ్యాహ్నం తర్వాత ప్రచారానికి వెళ్లిన బారాస పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.
గతంలో మన్నె వారి పల్లి గ్రామానికి మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పిస్తానని హామీ ఇచ్చి పది సంవత్సరాల తన పదవి కాలంలో ఎందుకు అమలు చేయలేదని,
తప్పుడు హామీలతో మమ్మల్ని మోసం చేశారంటూ గ్రామస్తులు, యువత పెద్ద ఎత్తున నిరసిస్తూ, గువ్వల బాలరాజు గో బ్యాక్ అంటూ ప్రచార కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నవారిని అక్కడి నుంచి పంపివేశారు.
ఇరు పార్టీల మధ్య తోపులాట ఉద్రిక్తత..
బారాస పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గెలిపించాలని మన్నె వారి పల్లి గ్రామానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రచార నిమిత్తం వెల్లగా గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో కాసేపు బారాస కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చేసుకుని ఉద్రిక్తత ఏర్పడింది.
పరిస్థితి చేయి దాటిపోక ముందే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల వారిని నచ్చ చెప్పే ప్రయత్నం చేసి ఘర్షణ వాతావరణాన్ని లేకుండా చర్యలు తీసుకున్నారు.