రాజ్యసభలో నేనున్నా.. లోక్ సభకు నా తమ్ముడిని పంపండి!
ఆయన గెలుపు ఖాయమే.. భారీ మెజారిటీ కోసమే ప్రచారం
కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి వ్యాఖ్య
రేణుక అక్కను ఆదరించారు.. నాకూ అవకాశం ఇవ్వండన్న రామసహాయం
ఖమ్మం పౌరసమితి అధ్యక్షుడు డా. పులిపాటి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
“నేను రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నా.. నా తమ్ముడు రామసహాయం రఘురామిరెడ్డిని లోక్ సభకు పంపించండి.. ఆయన పార్లమెంటులో అడుగు పెట్టడం ఖాయమే.. మెజారిటీ కోసమే మనందరి తాపత్రయం..” అని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. రఘురామిరెడ్డిని ఎంపీగా గెలిపిస్తే జిల్లాలోని ముగ్గురు మంత్రుల సహాయ సహకారాలతో మేమిద్దరం జిల్లాను ప్రత్యేకంగా అభివృద్ధి చేసే గొప్ప అవకాశం కలుగుతుందని చెప్పారు. ఖమ్మం పౌరసమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో బుధవారం ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం ఎంపీ స్థానంలో బిజెపి పోటీ చేయడం శోచనీయమన్నారు. ఆ మతతత్వ పార్టీని అరికట్టకపోతే దేశం ప్రమాదంలో పడుతుందన్నారు. తాజా ఎన్నికల్లో మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఉద్ఘాటించారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డిని సోనియమ్మ ఆచితూచి ఎంపిక చేశారని తెలిపారు. వందలాది ఎకరాలను దానం చేసిన దాతృత్వం ఆ కుటుంబానికి సొంతమని కొనియాడారు. సురేందర్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి అని, ఆయన కుమారుడిగా మన ముందుకు వచ్చిన రఘురాం రెడ్డిని మనందరం ఆదరించి ఢిల్లీ సభకు పంపాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి పాలకుడు దేశాన్ని 10 సంవత్సరాలు పరిపాలించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగం అంటే ఇదేనేమోనని ఎద్దేవా చేశారు. మళ్లీ బిజెపిని అధికారంలోకి తీసుకొస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేస్తారని విమర్శించారు. తాజా ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు మన వెంట నడుస్తున్నాయని, కాంగ్రెస్ ను గెలిపించుకుంటే జిల్లాను నలుదిక్కులా అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తనను ఆదరిస్తున్న జిల్లా ప్రజలు ఈసారి నా తమ్ముడు రఘురామిరెడ్డి ని గెలిపించి లోక్ సభకు పంపాలని ఆమె పిలుపునిచ్చారు.
నామా గెలిస్తే కేంద్రమంత్రి ఎలా అవుతారో..?
ఖమ్మం ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలిస్తే కేంద్ర మంత్రి ఎలా అవుతారో రాష్ట్ర ప్రజలకు కేసిఆర్ స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ప్రశ్నించారు. ఈ మాటల వెనుక ఆ రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న రహస్య ఒప్పందం ప్రజలకు తెలిసిపోతుందని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ శ్రీరాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుందన్నారు. మన భద్రాద్రి రామయ్యను మరిచిన మోడీ కి ఈసారి ఎన్నికల్లో ఆ రాముడే బుద్ధి చెబుతాడని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ పాలనలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఆకాశాన్ని చూస్తున్నాయని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోడీ 10 ఏళ్ల పాటు ఆ వాగ్దానాన్ని మరిచిపోయారని దుయ్యబట్టారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులను ఇంకా మరెన్నో ప్రభుత్వ రంగ సంస్థలను అదాని, అంబానీలకు కట్టబెట్టడం ఒక్కటే మోడీ ముందున్న ఎజెండా అని విమర్శించారు. సీబీఐ వంటి స్వతంత్ర సంస్థలను కూడా మోడీ విచ్చలవిడిగా వాడుకున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి దేశాన్ని ప్రమాదంలో పడకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ఎంపీగా రేణుక అక్కకు చాలా అవకాశాలు ఈ జిల్లా ప్రజలు ఇచ్చారని, ఈసారి ఆ అవకాశాన్ని తనకు ఇవ్వాలని రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రేణుక చాలా అగ్రెసివ్ నాయకురాలని, ఆమె దగ్గర తాను క్లాసులు తీసుకుంటానని చెబుతూ నవ్వులు పండించారు.
ఆ టెంపుల్ లో ఆ కుటుంబం పేరిటే తొలి అర్చన..
కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి స్థానికుడు కాదు అని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రఘురామిరెడ్డి తండ్రి గారైన సురేందర్ రెడ్డి పేరిట ప్రతిరోజు తొలి అర్చన జరుగుతుందని స్పష్టం చేశారు. ఆయన స్థానికుడు కాకపోతే ఆ దేవాలయంలో ప్రతిరోజు అర్చన ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఆ దేవాలయ వ్యవస్థాపకులు సురేందర్ రెడ్డి అని తెలిపారు. ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి పక్కా లోకల్ అని ఉద్ఘాటించారు. పొంగులేటి శ్రీనన్న ఎంపీగా కొనసాగిన ఐదేళ్లలో 50 ఏళ్ల మన్నన పొందారని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారని పులిపాటి కొనియాడారు. అలాంటి సౌమ్యత కలిగిన వ్యక్తి రఘురామిరెడ్డిని కుల, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రామ సహాయం కుటుంబం యావత్తు నిరుపేదలకు దానధర్మాలు చేయడంలోనే నిమగ్నమయ్యారని తెలిపారు. ఆస్తులను విద్యాలయాలకు దానం చేసిన గొప్ప దాతృత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రఘురాం రెడ్డికి ఎంపీగా పట్టం కట్టడంలో ప్రతి ఒక్కరు నిబద్ధతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పులిపాటి నాకు మూడు దశాబ్దాల సహచరుడు..
డాక్టర్ పులిపాటి ప్రసాద్ తనకు మూడు దశాబ్దాల సహచరుడని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నలమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచి తాము రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత దక్కకపోయినప్పటికీ పులిపాటి ఖమ్మంలో పులిలా బతికాడని కొనియాడారు. ప్రతి మనిషికీ ఒకే జన్మ ఉంటుందని, ఆ జన్మను సార్ధకం చేసుకోవడంలోనే వారి గొప్పదనం దాగి ఉంటుందని తెలిపారు. పులిపాటి ప్రసాద్ ప్రధానమంత్రితో సైతం అవార్డులను పొందిన ఘన చరిత్రను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘురాంరెడ్డి గెలుపు కోసం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం గొప్ప పరిణామని తెలిపారు. రఘురాం రెడ్డి నాన్ లోకల్ అంటూ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఆయన పక్కా లోకల్ అని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఇచ్చినట్లే ఎంపీ అభ్యర్థి రామ సహాయానికి కూడా భారీ మెజార్టీని అందించి కాంగ్రెస్ కు, ఆ పార్టీ అధినేత్రి సోనియమ్మకు కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, కమ్మజన సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఇ రామారావు, ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి, జహీర్ అలీ, బేబీ స్వర్ణకుమారి తో పాటు ఖమ్మంలోని ప్రముఖ వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులు సుమారు 6 వందల మంది ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళన ఏర్పాట్లను ఖమ్మం పౌర సమితి ఆహ్వాన కమిటీ సభ్యులు నిర్వహించగా, భారీ జన సందోహంతో సభ సక్సెస్ అయినందున డాక్టర్ పులిపాటి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.