మాట్లాడుకుందాం రండి…!
– నాలుగురోజుల పాటు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
– ఒక్కో రోజు ఒక్కో మండలంలో…
– 17న ఖమ్మం రూరల్, 18న నేలకొండపల్లి
– 19న తిరుమలాయపాలెం, 20న కూసుమంచి
– ఆయా మండలాల్లోని ప్రతి గ్రామంలో 20నిమిషాల పాటు సమావేశం
– ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పొంగులేటి సరికొత్త పంథా
ఖమ్మం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయానికి బాధితులను రప్పించుకునే అవసరం లేకుండా పాలేరు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపిక చేసిన పలు గ్రామాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. 17న ఖమ్మం రూరల్, 18న నేలకొండపల్లి, 19న తిరుమలాయపాలెం, 20న కూసుమంచి మండలాల్లో ఆయన పర్యటన సాగనుంది.
– ప్రజల వద్దకే పాలన అనే రీతిలోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజల వద్దకే పాలన అందిస్తామని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బాధితులు తిరగాల్సిన అవసరం లేదని చెబుతూ వస్తోంది. ఇదే తరహాలో మంత్రి పొంగులేటి సైతం తనను ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపించిన పాలేరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రజల వద్దకు వెళ్లేలా నిర్ణయం తీసుకున్నారు. నేరుగా కలిసి.. వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకుని వీలైతే అక్కడికక్కడే పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించుకున్నారు.
– ఒక్కో గ్రామంలో ఇరవై నిమిషాలు…
నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాలు ఉండగా ఒక్కో మండలంలో ముప్పైకి పైగా గ్రామాలున్నాయి. కాగా వాటిలో తొలి విడతలో ప్రతి మండలంలో 15 నుంచి 18 గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం సైతం స్థానిక ప్రజలతో కలిసి చేసేలా కసరత్తు జరుగుతోంది. ఒక్కో గ్రామంలో ఇరవై నిమిషాల పాటు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆ సమావేశంలోనే బాధితుల నుంచి వినతులను స్వీకరించి, సత్వర పరిష్కారం చూపే ప్రయత్నం చేయనున్నారు.