రుణమాఫీపై కదలిక.. అర్హుల జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం
ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు.పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. ఎప్పటిలోగా రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందో (కటాఫ్) ఇప్పటికే వివరాలు ప్రకటించారు.
ప్రక్రియకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కుటుంబంలో ఒక రైతుకు పరిమితం చేస్తారా? లేదా ఎంతమంది తీసుకుంటే అంతమందికి మాఫీ వర్తింపజేస్తారా? అనేది తేల్చాలి.
కటాఫ్ తేదీలివే.. ఏప్రిల్ 1, 2019 నుంచి డిసెంబరు 10, 2023 మధ్య రూ.2 లక్షల లోపు రుణాలు తీసుకున్న, రెన్యువల్ చేసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుందని లోగడ ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం అర్హులైన వారి జాబితా పంపాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు(ఏపీజీవీబీ)లను రాష్ట్ర అధికారులు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాంకులే పెద్ద ఎత్తున పంట రుణాలను మంజూరు చేశాయి.
డీసీసీబీ ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఆయా బ్యాంకుల్లో 1.75 లక్షల మంది పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో 80 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. సుమారు రూ.882.12 కోట్ల వరకు రుణమాఫీ వర్తించే అవకాశం ఉందని సమాచారం.
మరో బ్యాంకు ఏపీజీవీబీ పరిధిలో ఖమ్మం జిల్లాలో 83 వేల మంది రైతులు రూ.945.76 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42 వేల మంది రూ.448.35 కోట్ల రుణాలు పొందారు. వీటితో పాటు జాబితా తయారు చేయాలని ఒకట్రెండు రోజుల్లో ఇతర వాణిజ్య బ్యాంకులకు కూడా ఆదేశాలు రానున్నట్లు సమాచారం.
రెన్యువల్ చేయించకుంటే అనర్హులు? గత ప్రభుత్వం రైతులకు నాలుగేళ్లలో దశల వారీగా రుణమాఫీ వర్తింపజేసింది. రూ.25 వేలు, రూ.50 వేలు, ఆ తర్వాత రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసింది. ఈ క్రమంలో రుణాలను సకాలంలో రెన్యువల్ చేయించని వారికి మాఫీ జరగలేదు. కొత్త ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ తేదీల్లోనూ వీరికి చోటుదక్కలేదు. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి రైతులు సహకార సంఘాల్లో ఎక్కువగా ఉన్నారు.
చెల్లించిన వారికీ వర్తింపు కుటుంబ అవసరాల కోసం భూములు అమ్ముకున్నవారు, పిల్లల పెళ్లిళ్ల అనంతరం హక్కులు బదలాయించిన వారిలో ఎవరైనా కటాఫ్ తేదీల మధ్య రుణాలు చెలిస్తే.. వారికి మాఫీ వర్తిస్తుంది. ఇతర అవసరాలకు అప్పులు చెల్లించి పట్టా పుస్తకాలు, డాక్యుమెంట్లు తీసుకున్న వారు చాలామంది ఉన్నారు.