ఫోన్ లైన్ లో డాక్టర్ డెలివరీ చేసిన నర్స్
శిశువు మృతి కేసు నమోదు
వరంగల్ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి ఫోన్ ద్వారా డాక్టర్ సలహా తీసుకుంటూ ఇద్దరు నర్సులు ఆపరేషన్ చేశారు.
దాంతో పుట్టిన మగశిశువు ఒక రోజు తర్వాత చనిపోయింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన కసిరెడ్డి నరేశ్ భార్య బేబీ శ్రీజ పురిటి నొప్పులతో ఈ నెల 16న వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చేరింది.
17న నొప్పులు రావడంతో డెలీవరీ చేయాలని నరేశ్ కుటుంబసభ్యులు డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ మానసా రెడ్డిని కోరారు.అయితే, ఆమె శ్రీజను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
నొప్పులు మరింత పెరగడంతో అక్కడే ఉన్న స్టాఫ్ నర్సులు సునీత, ఏఎన్ఎమ్ సుభద్ర డాక్టర్ కు ఫోన్ చేశారు. తాను ఫోన్ లో చెప్పినట్లు ఆపరేషన్ చేసేయండని నర్సులకు మానసా రెడ్డి సూచించింది.
దాంతో ఇద్దరు నర్సులు ఫోన్లో డాక్టర్ తో మాట్లాడుతూ శ్రీజకు డెలీవరీ చేశారు. మగశిశువు పుట్టగా..బిడ్డను తల్లికి చూపించకుండానే వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
అక్కడ ఆ శిశువు చికిత్స పొందుతూ చనిపోయింది. తమ బిడ్డ చనిపోవడానికి డ్యూటీ డాక్టర్ మానసా రెడ్డి, స్టాఫ్ నర్సు సునీత, ఏఎన్ఎమ్ సుభద్ర నిర్లక్ష్యమే కారణమంటూ శ్రీజ భర్త నరేశ్ వర్థన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.