ఏసీబీ వలలో ఏసీపీ హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ టి.ఎస్‌.ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కారు. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు సోదరుడితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఇవి కొనసాగాయి. సోదాల్లో భారీగా రూ.500 నోట్ల కట్టలను, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఇప్పటివరకు విశ్లేషించిన …

ఏసీబీ వలలో ఏసీపీ

హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ టి.ఎస్‌.ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కారు. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు సోదరుడితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఇవి కొనసాగాయి.

సోదాల్లో భారీగా రూ.500 నోట్ల కట్టలను, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఇప్పటివరకు విశ్లేషించిన సమాచారం మేరకు ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.3.46 కోట్ల వరకు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు.

సోదాలను అనిశా సంయుక్త సంచాలకుడు సుధీంద్ర పర్యవేక్షించారు. బుధవారం ఉమామహేశ్వరరావును న్యాయస్థానంలో ప్రవేశపెడతామని, ఎఫ్‌ఎంసీజీ పెట్టుబడుల కేసులోనూ అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఏసీబీ బృందాలు మంగళవారం రాత్రి 9గంటల వరకు చేసిన సోదాల్లో లభించిన సమాచారం మేరకు… మొత్తం రూ.37.5 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలు, హైదరాబాద్‌ శివార్లు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో ఘట్‌కేసర్‌లో ఐదుచోట్ల, విశాఖపట్నం, చోడవరంలలో ఏడుచోట్ల, శామీర్‌పేట, మల్కాజిగిరి, కూకట్‌పల్లిల్లో ఒక్కోటి చొప్పున స్థలాలు, శామీర్‌పేటలో ఖరీదైన విల్లా ఉన్నట్లు గుర్తించారు. రెండు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తేల్చారు. దర్యాప్తు ముగిస్తే ఆస్తుల చిట్టా పెరిగే అవకాశముందన్నారు. స్థిరాస్తి సంస్థ సాహితీ ఇన్‌ఫ్రా మోసానికి సంబంధించిన కేసును ఉమామహేశ్వరరావు దర్యాప్తు చేశారు.

హైదరాబాద్‌ చుట్టుపక్కల పలు వెంచర్లలో వందల మంది వినియోగదారుల నుంచి ప్రీలాంచ్‌ ఆఫర్ల పేరిట రూ.2000 కోట్లు వసూలు చేసి, ఫ్లాట్లు ఇవ్వలేదని, కొన్నింటికి డబుల్‌ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆ సంస్థపై అభియోగం. 'సాహితి' ఎండీ బూదాటి లక్ష్మీనారాయణతోపాటు ఆయన కుటుంబ సభ్యులపైనా హైదరాబాద్‌ సీసీఎస్‌లో కేసులు నమోదయ్యాయి.

దర్యాప్తు చేసిన ఉమామహేశ్వరరావు… సంస్థ నిర్వాహకులతో అంటకాగారనే విమర్శలు వచ్చాయి. భారీగా ముడుపులు తీసుకుని, ఉల్టా బాధితులనే బెదిరించారనే ఆరోపణలు వినిపించాయి. దాంతో పలువురు బాధితులు ఉమామహేశ్వరరావు అక్రమాస్తులపై ఆరా తీసి, ఏసీబీకి సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

ఉమామహేశ్వరరావు ఇంట్లో లభించిన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, డైరీలో సందీప్‌ అనే పేరును అధికారులు గుర్తించారు. అతనితో కలిసి ఉమామహేశ్వరరావు వ్యాపార, స్థిరాస్తి లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated On 22 May 2024 2:07 PM IST
cknews1122

cknews1122

Next Story