నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు.. ఆ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్
హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతినేలా అధికారులు వ్యవహరిస్తే సహించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు.
హైదరాబాద్ మహానగరానికి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పోలీసు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సూచించారు.
కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా 365 రోజులు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలన్నారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలని తెలిపారు. జూన్ 4వ తేదీ లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. నాళాల పూడికతీతలో నిర్లక్ష్యం వద్దన్నారు. పూడిక తీసిన చెత్తను సమీప ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. క్వారీ ఏరియాలను గుర్తించి ఆ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వాటికి బారీకేడింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
గతంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కంటోన్మెంట్ ఏరియాలో నాళాల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టండి.. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అన్నారు. సమస్యాత్మక నాళాల వద్ద అవసరమైతే ప్రతీ రోజు క్లీనింగ్ చేపట్టాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని చెప్పారు. పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం.. వారికి ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.