రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం
దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరుగనుంది. ఇదే చివరిది. ఇప్పటివరకు ఆరుదశల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.చివరి విడతలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
బిహార్- 8, చండీగఢ్- 1, హిమాచల్ ప్రదేశ్- 4, జార్ఖండ్- 3, ఒడిశా- 6, పంజాబ్- 13, ఉత్తరప్రదేశ్- 13, పశ్చిమ బెంగాల్- 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు.
మోదీ పోటీలో నిలిచిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గానికీ అదే రోజున పోలింగ్ ఉంటుంది. చివరి దశలో కూడా పైచేయి సాధించడానికి ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్నారు. ముమ్మరంగా ప్రచారం సాగిస్తోన్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండికూటమి తరపున ప్రచారం చేపడుతున్నారు రాహుల్ గాంధీ. ఇందులో భాగంగానే ఇవాళ బిహార్ లో ప్రచారం చేపడుతున్న ఆయనకు పెను ప్రమాదం తప్పింది. రాహుల్ గాంధీతో పాటు చాలామంది నేతలు వుండగానే ఒక్కసారిగా వేదిక కుంగిపోయింది. అయితే ఈ ప్రమాదం నుండి రాహుల్ సురక్షితంగా బయటపడ్డారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ.. బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భక్తియార్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. కీలక హామీలను ఇచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరించారు.
భక్తియార్‌పూర్‌లో సభ ముగిసిన అనంతరం ఆయన అక్కడి నుంచి ఆయన నేరుగా పాట్నా శివార్లలోని పాలీగంజ్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది.
పాటలీపుత్ర లోక్‌సభ పరిధిలోకి వస్తుందీ అసెంబ్లీ నియోజకవర్గం. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి పోటీలో ఉన్నారు.