ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు కాల్…
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
కాసేపట్లో బాంబు పేలిపోతుందంటూ చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజా భవన్ లో బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఫోన్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రజా భవన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం. దీంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ప్రజా భవన్ లో బాంబు పెట్టామని, 10 నిమిషాల్లో బాంబు పేలిపోతుందని ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు ప్రజా భవన్ సిబ్బందికి సమాచారం అందించి, తనిఖీలు చేపట్టారు. ప్రజా భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ప్రజా భవన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. ప్రజా భవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ఉంది. దీంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు ఆగంతకులు.
పోలీసులను పరుగులు పెట్టించేందుకు కొందరు ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల దిల్లీ, ముంబయి సహా దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రగతి భవన్ టు ప్రజా భవన్
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి భవన్ ను నిర్మించింది. ప్రగతి భవన్ అప్పట్లో ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉండేది. పదేళ్ల పాటు కేసీఆర్ ప్రగతి భవన్ నుంచే పాలన సాగించారు. గతంలో ప్రగతి భవన్ లోకి ఎవర్నీ అనుమతించే వారు కాదు.
అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకోవడం జరిగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజా భవన్ గా పేరు మార్చింది.
ప్రజా భవన్ లో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తుంది. దీంతో పాటు ప్రజా భవన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం కుటుంబం సహా ప్రజా భవన్ ఆవరణలోనే ఉంటున్నారు.
ప్రజా భవన్ లోకి నిత్యం ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తుంటారు. అయితే గత ప్రభుత్వం ప్రగతి భవన్ లోపలికి ఎవర్నీ అనుమతించేది కాదని తాము అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ గోడలు కూలుస్తామంటూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో పదే పదే చెప్పేవారు.
అలాగే అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప గ్రిల్స్ ను తొలగించి, ప్రజా వాణి పేరుతో ప్రజా సమస్యలు వినే కార్యక్రమం చేపట్టారు. సీఎం, మంత్రులు, మంత్రులు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. అయితే తాజాగా ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.