అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుకుంటూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పడమే కాక సాధ్యమైనంత మేర వాటిని అమలు చేసింది.
ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. కొన్ని హామీల అమలుకు బ్రేక్ పడింది. ఇప్పటి వరకు 5 గ్యారెంటీలను అమలు చేసింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పెంపు, ఉచిత ప్రయాణం, ఉచిత కరెంట్, 500లకే గ్యాస్ సిలిండర్ హామీలు అమలు చేసి.. ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోన్న రేవంత్ సర్కార్.. ఇక అన్నదాతల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఆమేరకు ప్రణాళికలు రెడీ చేస్తోంది.
రైతుభరోసా పథకం కింద ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతుల ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీంతో పాటు.. రైతు రుణమాఫీపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టడమే కాక.. దాని అమలు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది రేవంత్ సర్కార్. ఇక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే.. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని సీఎం రేవంత్ సహా.. పలువురు కాంగ్రెస్ మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఆగస్టు 15వ తేదీన రుణ మాఫీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా.. రుణమాఫీ పూర్తిగా చెల్లించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రుణమాఫీ కోసం ఇప్పటికే బ్యాంకుల నుంచి 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఒకే వ్యక్తికి రెండు లేదా మూడు అకౌంట్ల ద్వారా రూ.2 లక్షల వరకు లోన్ తీసుకుంటే ఆ మొత్తమంతా మాఫీ చేస్తామని తెలిపారు. అయితే ఇది కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రుణమాఫీకి సంబంధించి మరో కీలక విషయం తెలిసింది. రైతులు బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే.. వాటికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని.. ఈమేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సమాచారం.
తాజాగా రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రొఫార్మాలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉండటం విశేషం. ఇప్పటికే ప్రభుత్వం రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను కోరింది. జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. తర్వాత అర్హత గల రైతులకు ఈ రుణమాఫీ చేయనున్నారు. ఇక గోల్డ్‌లోన్‌పై తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తారని తెలిసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల చాలా మందికి రెండు రకాల లబ్ధి కలగనుంది అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.