అత్తింటి వేధింపులు తట్టుకోలేక గర్భిణీ మహిళా బలవన్మరణం… కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో ఓ గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. వారసుడు కావాలని అత్తింటివారు వేధించడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపలేక తానే ప్రాణాలు తీసుకుంది. సీఐ టి.వి.వి.రామారావు కథనం మేరకు.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన కావ్యశ్రీ (19)కి రెండేళ్ల కిందట విజయవాడ కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్‌తో(31) వివాహమైంది. శ్రీకాంత్‌ సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పదినెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్యశ్రీ, ఇటీవల మళ్లీ …

అత్తింటి వేధింపులు తట్టుకోలేక గర్భిణీ మహిళా బలవన్మరణం…

కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో ఓ గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. వారసుడు కావాలని అత్తింటివారు వేధించడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపలేక తానే ప్రాణాలు తీసుకుంది.

సీఐ టి.వి.వి.రామారావు కథనం మేరకు.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన కావ్యశ్రీ (19)కి రెండేళ్ల కిందట విజయవాడ కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్‌తో(31) వివాహమైంది. శ్రీకాంత్‌ సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

పదినెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్యశ్రీ, ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. ఆమెకు ప్రస్తుతం ఐదో నెల. భర్త శ్రీకాంత్‌ నాలుగు రోజుల క్రితం కావ్యశ్రీకి విజయవాడలో స్కానింగ్‌ చేయించగా, ఆడపిల్ల పుడుతుందని అక్కడి సిబ్బంది చెప్పారు.

దీంతో దంపతుల మధ్య గొడవ మొదలైంది. ఆడపిల్ల వద్దు, వారసుడే కావాలని కావ్యశ్రీపై భర్త శ్రీకాంత్‌తోపాటు అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావు ఒత్తిడి తెచ్చారు. దీంతో భార్యాభర్తలు గత బుధవారం ఆస్పత్రికి వెళ్లగా, అబార్షన్‌ చేస్తే ప్రమాదమని డాక్టర్‌ హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు.

అయితే శ్రీకాంత్‌ స్నేహితుడు కానిస్టేబుల్‌ శ్యామ్‌ తన పరపతితో అబార్షన్‌ చేయిస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అబార్షన్‌ చేయించుకోనని కడుపులో బిడ్డను చంపలేనని శుక్రవారం రాత్రి కావ్యశ్రీ తన భర్తకు తేల్చి చెప్పింది.

శనివారం ఉదయం భార్యాభర్తలు మళ్లీ అబార్షన్‌ విషయమై చర్చించుకున్నారు. అనంతరం కావ్యశ్రీ స్నానానికి వెళ్తూ భర్తకు ఫోన్‌ ద్వారా ఓ మెసేజ్‌ చేసింది.

'తాను వారసుడిని ఇవ్వలేనని,..కడుపులోని బిడ్డను చంపలేనని.. తనను ఛీదరించుకోవద్దని.. పదినెలల కుమార్తెను తన తల్లిదండ్రులే పెంచాలని..తనను క్షమించాలని' ఆ మెసేజ్‌లో పేర్కొంది.

కావ్యశ్రీ బాత్‌రూమ్‌ నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కటుంబసభ్యులు, భర్త బాత్‌రూమ్‌ తలుపులు తెరిచి చూడగా వెంటిలేటర్‌కు కావ్యశ్రీ ఉరేసుకుని కొనఊపిరితో ఉంది. ఆమెను వెంటనే కానూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో కావ్యశ్రీ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతిరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కావ్యశ్రీ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated On 3 Jun 2024 2:24 PM IST
cknews1122

cknews1122

Next Story