ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన డబుల్ బెడ్రూం లబ్ధిదారులు
సూర్యాపేట : కేసీఆర్ హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు(Double bedroom) వెంటనే హ్యాండోవర్ చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి మంజూరు పత్రాలు ఇచ్చినప్పటికీ అధికారులు అలాట్మెంట్లు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాట్మెంట్ ఇస్తామని డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్దకు రమ్మన్న అధికారులు ఎంతసేపటికి రాకపోవడంతో కలత చెందిన లబ్ధిదారులు సూర్యాపేటలో(Suryapet) ఆర్డీవో కార్యాలయాన్ని(RDO office) ముట్టడించారు.
వివరాల్లోకి వెళ్తే.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి మంజూరు పత్రాలు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు. ఎన్నికల కోడ్ పేరుతో గత 8 నెలలుగా కేటాయింపులు జరుపలేదు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం కేటాయిస్తామని హామీనిచ్చారు.
దీంతో బుధవారం లబ్ధిదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు 11 గంటలు అయినా అధికారులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఇండ్ల కేటాయింపునకు ఆర్డీవో హామీతో లబ్ధిదారులు ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఈ సారి మోసం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.