పాత పద్ధతిలోనే రైతుభరోసా!
తొలుత ఎకరానికి రూ.5 వేలు.. ప్రభుత్వ యోచన
వచ్చే నెల ఎకరానికి మరో రూ.2,500 ఇవ్వాలని భావిస్తున్న సర్కారు
గత యాసంగి సీజన్‌లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా..
రైతుభరోసా మార్గదర్శకాలు ఖరారు కాకపోవడమే కారణం
ఇప్పటికే ప్రారంభమైన వానాకాలం సీజన్
హైదరాబాద్:ఈ వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం, వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. గత యాసంగి సీజన్‌లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతుభరోసా సొమ్ము ఇస్తారు. వాస్తవంగా ప్రతి ఏడాది జూన్‌లోనే రైతుబంధు సొమ్ము ఇస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలన్నది రైతుబంధు నిబంధన.
సీజన్‌కు ఎకరానికి రూ.7,500 ఇస్తామన్న కాంగ్రెస్
రైతుబంధు పథకాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రతి రైతుకు అందజేశారు. అలా ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. ఆ తర్వాత సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీజన్‌కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇవ్వాలి.
అయితే అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్‌లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలే ఇచ్చింది. వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 ఇస్తామని పేర్కొంది. అయితే వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ రైతుభరోసా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. పైగా ఈ మార్గదర్శకాలను అసెంబ్లీలో చర్చించి ఖరారు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
అయితే ఈ వానాకాలం సీజన్‌లో రైతులకు నిర్ణీత సమయంలోగా రైతుభరోసా సొమ్మును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం.. పాత పద్ధతిలో సొమ్ము అందజేయనుంది. అంటే ఎకరాకు తొలుత రూ.5 వేలే ఇస్తారు. ఆ తర్వాత రైతుభరోసా మార్గదర్శకాలు ఖరారు చేసి వచ్చే నెల మరో రూ.2,500 ఎకరాకు ఇవ్వాలనేది సర్కారు ఆలోచనగా ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. యాసంగిలో 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేసింది. ఈ వానాకాలంలోనూ ఇదే మొత్తం రైతులకు ఇచ్చే అవకాశముంది.
మార్గదర్శకాలపై కసరత్తు
రైతుభరోసా మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. సీలింగ్ ప్రకారం ఇవ్వాలా? ఎలా చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పంట వేసినట్లు నిర్ధారణ అయిన భూముల రైతులకే ఆర్థిక సాయం అందించాలని కూడా భావిస్తున్నారు. అంతేకాదు దీనిని గరిష్టంగా ఐదెకరాలకే పరిమితం చేసే అంశమూ చర్చకు వస్తోంది. గత యాసంగి సీజన్‌లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.97 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు.
అందులో ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.32 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుభరోసా అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం. దీంతో ఐదెకరాలకు పరిమితం చేసినా 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు.
రాష్ట్రంలో ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న రైతులు 10.89 లక్షల మంది ఉన్నారు. మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న రైతులు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులు 6.65 లక్షల మంది ఉన్నారు. కొండలు, గుట్టలను కూడా రైతుభరోసా నుంచి మినహాయిస్తారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా అటువంటి భూములను గుర్తిస్తారు.