నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సును ఆపేసిన మహిళ…
బస్సులో ఖాళీ లేదు.. మరో బస్సులో రావాలని అన్న కండక్టర్
ఆర్టీసీ బస్సును ఎక్కే వరకు ఆపకుండా వెళ్లిపోవడంపై ఓ మహిళా ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో ద్వారా వెంబడించి బస్సుకు అడ్డం తిరిగి ఆందోళన చేపట్టారు.ఈ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చాగంటి మంజుల తన ముగ్గురు పిల్లలతో కలసి జగిత్యాల జిల్లా కొండగట్టులో ఉంటున్నారు. బుధవారం పిల్లలతో కలిసి వరంగల్ వచ్చారు.
వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ వెళ్ళడానికి తన ముగ్గురు పిల్లలతో కలిసి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో నెక్కొండ- మహబూబాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు వచ్చింది. ఆ బస్సులో తన ఇద్దరు కూతుళ్లు, సామగ్రితో సహా ఎక్కించారు.
దివ్యాంగుడైన తన కుమారుడిని లోపలికి ఎక్కించడానికి బస్సు కండక్టర్ నిరాకరించాడు. అప్పటికే బస్సు నిండిపోయి.. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి రావడంతో దివ్యాంగుడైన తన కుమారుడిని ఎక్కించడానికి ‘బస్సులో ఖాళీ లేదు.. మరో బస్సులో రావాలని’ కండక్టర్ సూచించారు.
అప్పటికే తన ఇద్దరు కుమార్తెలు బస్సులో ఉన్నారన్న విషయం తెలియని డ్రైవర్.. కండక్టర్ సూచన మేరకు ముందుకు పోనిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా ప్రయాణికురాలు కొంతదూరం బస్సు వెనకాల పరుగెత్తారు. చివరకు ఓ ఆటో తీసుకొని వెళ్లి శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద బస్సును అడ్డగించారు. నడి రోడ్డుపై శివమెత్తిన మహిళ తన ప్రతాపం చూపించారు.
బస్సు ఎందుకు ఆపలేదని బస్సుకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. తన ఇద్దరు పిల్లలు బస్సులో ఉండగా, దివ్యాంగుడైన కుమారుడిని ఎక్కించుకోకుండా ఎలా వెళతారని బస్సు డ్రైవర్, కండక్టర్లపై అగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు అరగంటకుపైగా బస్సు ముందుకు కదలకుండా అడ్డుకోవడంతో.. ప్రయాణికులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
మీ కుమారుడిని ఆటోలో నుంచి తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తే కలిసి వెళ్లామని చెప్పినా.. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆటో ఛార్జీలు ఎవరిస్తారని ప్రశ్నించి పట్ట పగలే చుక్కలు చూపించింది. బస్సును తిరిగి బస్టాండ్‌కు తీసుకెళ్లి.. తన కుమారుడిని ఎక్కించుకొని రావాలని పట్టుబట్టింది.
ఈలోగా ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళా ప్రయాణికురాలిని పక్కకు తీసుకెళ్లి శాంతింపజేశారు. బస్టాండ్‌లో ఉన్న దివ్యంగుడిని ఎక్కించి ఆగిన బస్సును పంపించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.