బంజారా బిడ్డకు సాహిత్య యువ పురస్కార్ అవార్డు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బంజారా రచయిత రమేశ్ కార్తీక్ నాయక్ ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్ నగర్ తండాకు చెందిన ఆయన.. 2021లో తెలుగులో రాసిన ‘ఢావ్లో’గోర్ బంజారా కథలకు గాను అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యారు.
బంజారా సమాజానికి సంబంధించిన జీవ నశైలిపై రమేశ్ తన రచనలు చేశారు. రమేశ్ కార్తీక్ వయసు 26 ఏళ్లు. ఆయన తల్లిదండ్రులు సేవంత, మోజీరాం వ్యవసాయం చేస్తారు. పదో తరగతిలోనే కవిత్వం రాయడం మొదలు పెట్టిన రమేశ్.. గిరిజనుల జీవితాలు, మనస్తత్వాలు, కష్ట సుఖాలు అంశాలుగా కవిత్వం, కథలు రాయడం ప్రారంభించాడు.
‘బల్దేర్ బండి’ పేరిట మొదటి కవిత సంపుటి రాశాడు. సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన రమేశ్ కార్తీక్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు.
చంద్రశేఖర్ ఆజాద్ కు బాలసాహిత్య పురస్కారం : ‘మాయాలోకం’ తెలుగు నవల రాసిన రచయిత పి.చంద్రశేఖర్ ఆజాద్ అకాడమీ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు.
1955లో గుంటూరు జిల్లా భట్టి ప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జన్మించిన పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్ ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఆయన అనేక కథలు, నవలల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ఆయన నవలలు పలు పత్రికల్లో సీరియళ్లుగా ప్రచురితమయ్యాయి.
మొత్తంగా 47 మందికి అవార్డులు : కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూ టివ్ బోర్డు సమావేశంలో 23 మంది రచయితలను ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి, 24 మంది రచయితలను బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక చేశారు.
సంస్కృతం మినహా మిగిలిన అన్ని భాషలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ మేరకు సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు.
సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి 35 ఏళ్లలోపు వయసున్న రచయితల రచనలను పరిగణనలోకి తీసుకుంటారు. 2011లో ప్రారంభమైన సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన రచయితకు రూ.50 వేల నగదు, రాగి ఫలకం, ప్రశంసా పత్రం అందిస్తారు.