త్యాగానికి ప్రతీక బక్రీద్
దైవ మార్గంలో దేన్నైనా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి..
సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గం బాధావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం కేంద్రంలోని ఈద్గా వద్ద జూలూరుపాడు జామ మసీద్ మౌలానా షేక్ అరీఫ్ పాపకొల్లు మసీదు మౌలానా మొహమ్మద్ కలి లూల్ రహిమాన్ ఆధ్వర్యంలో సామూహిక బక్రీద్ ఈద్ ఉల్ ఆదాహే ప్రత్యేక నమాజ్ జరిగింది
నేడే బక్రీద్ పర్వదినం
ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే పండగల్లో మొదటిది ఈద్ ఉల్ ఫితర్(రంజాన్). రెండోది ఈద్ ఉల్ అజా(బక్రీద్). రంజాన్లో దైవాన్ని సంతుష్ట పర్చటానికి అత్యంత కఠిన ఉపవాసాలు చేయటంతో పాటు దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. అందుకే దాన ధర్మాల నెలగా రంజాను భావిస్తారు. ఇక బక్రీద్ పండగను ప్రతి ఏడాది ‘హిజ్రా’ క్యాలెండర్ను అనుసరించి పన్నెండో నెల జిల్స్టాజ్ పదిన అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
ఈ పండగను త్యాగాలకు గుర్తుగా చేసుకోవడం ఆనవాయితీ. అల్లాను సంతుష్ఠ పర్చటానికి, ఆయన మార్గంలో త్యాగాలను చేయాల్సిన పండగగా భావిస్తారు. బక్రీద్ పండగ రోజు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం జంతువులను త్యాగం చేయటంలో భాగంగా వాటిని కోసి మాంసాన్ని నిరుపేదలకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి అందజేస్తారు.
మనలో ఉన్న చెడును సైతం త్యాగం చేసి సజ్జనులుగా జీవించాలనేదే బక్రీద్ పండగ సందేశం. దైవాజ్ఞకు లోబడి ఆ అల్లాహ్కు విశ్వాసంగా ప్రతి ముస్లిం పరోపకార బుద్ధితో, శాంతియుత జీవితం గడుపుతూ సమాజ శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలనే సందేశాన్ని ఈ పండగ తెలియజేస్తుంది.
ముస్లింలంతా జిలాజ్ మాసంలో చంద్రమానం ప్రకారం పండగను ఘనంగా పవిత్రంగా నిర్వహిస్తారు. అత్యంత పవిత్రంగా భావించే ‘హజ్’ యాత్ర ఇదే నెలలో చేస్తారు. హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు సైతం పవిత్ర స్థలమైన మక్కాలోనూ జంతువులను అక్కడే కొనుగోలు చేసి ఖుర్బానీ(త్యాగం) చేస్తారు.
ఇస్లాం విశ్వాసాల ప్రకారం..
పూర్వం ప్రవక్త ఇబ్రాహిం అలైహిస్సలాం అల్లాహ్ అత్యంత విశ్వసనీయత కలిగి ఉండే వారు. ఆ అల్లా ఆయనకు పెట్టిన ఎన్నో కఠిన పరీక్షల్లో నెగ్గి విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన ఒక కలలో అతనికి అత్యంత ఇష్టమైన దానిని త్యజించమని ప్రవక్త ఇబ్రాహిం అలైహిస్సలాంను దేవుడు ఆదేశిస్తాడు.
ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడు ఒక్కగానొక్క కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం. దైవాజ్ఞ శిరసావహించటానికి సంసిద్ధుడైన ఆయన తన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను తోడ్కొని దైవాజ్ఞ నెరవేర్చటానికి ఉదయమే బయలు దేరుతాడు.
దైవాజ్ఞ ప్రకారం తన కుమారుడిని అల్లా పేరిట ఖుర్బానీ (త్యాగం) చేయటానికి సిద్ధమవుతాడు. వాస్తవానికి అల్లా ఇబ్రాహింను అతని కొడుకును త్యాగం చేయమని కోరలేదు. అతనికిష్టమైనది మాత్రమే త్యజించమని ఆదేశిస్తాడు. కాని తనకు కొడుకే అత్యంత ప్రీతిపాత్రుడు కాబట్టి కుమారుడిని ఖుర్బానీ ఇవ్వటానికి సిద్ధపడతాడు.
తన కుమారుడితో నిర్జన ప్రదేశానికి చేరుకున్నాక విషయాన్ని ఇస్మాయిల్ అలైహిస్సలాంకు వివరించగా దైవాజ్ఞ దిక్కరణ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని, తాను దైవాజ్ఞ ప్రకారం త్యాగం(ఖుర్బాన్) అవ్వటానికి సిద్ధంగా ఉన్నానంటాడు. కొడుకు మీద ఉన్న ప్రేమ దైవాజ్ఞ దిక్కరించేలా చేస్తుందేమోనన్న భయంతో ప్రవక్త ఇబ్రాహిం అలైహిస్సలాం తన కళ్లకు గంతలు కట్టుకొని ఖుర్బానీ కార్యం పూర్తి చేస్తాడు.
అనంతరం కళ్ల గంతలు తొలగించి చూసేటప్పటికి తన కుమారుడు క్షేమంగా ఉండి, అతనుండాల్సిన స్థానంలో పొట్టేలను చూసి దేవుడు మరో సారి తన విశ్వసనీయత పరీక్షించటానికే ఇలా ఆదేశించాడని భావించి కృతజ్ఞతలు తెలుపుతాడు. అతడి త్యాగనిరతికి దైవం మెచ్చి కుమారుడిని క్షేమంగా అప్పగించాడని భావిస్తాడు. ఆ నాటి నుంచి ఏటా ఖుర్బానీ ఆనవాయితీ కొనసాగుతోంది.
పవిత్రంగా భావిస్తారు
ఖుర్బానీ చేసిన జంతువు మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం మాత్రమే కుటుంబ సభ్యులు ఉంచుకుంటారు. మిగిలిన రెండు భాగాల్లో ఒకటి బంధుమిత్రులకు, మరొకటి నిరుపేదలకు పంపిణీ చేస్తేనే ఖుర్బానీ పరమార్థం పూర్తవుతుంది. విధిగా పంపిణీ చేస్తారు. జంతువుకు సంబంధించిన చర్మం ఆధ్యాత్మిక పాఠశాలలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తారు.
వారు చర్మాన్ని విక్రయించి ఆ డబ్బును సామాజిక కార్యక్రమాలకు చర్మాన్ని విక్రయించి ఆ డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. ఖుర్బానీ మాంసాన్ని పవిత్రంగా భావిస్తారు.
దైవ మార్గంలో నడవాలి…
త్యాగాలకు గుర్తుగా బక్రీద్ పండగ నిర్వహిస్తారు. త్యాగంతో పాటు మనలోని చెడును సైతం త్యజించాలి. అప్పుడే ఆ అల్లా సంతుష్టుడవుతాడు. అల్లా ఆజ్ఞను శిరసావహించిన వారమై దేవుడిపై విశ్వసనీయత చాటిన వారమవుతాం.
దైవ మార్గంలో దేన్నైనా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి. మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాల వారు దేవుడి ఆజ్ఞను ధిక్కరించకుండా శాంతి, సామరస్యాలతో దైవ మార్గంలో జీవించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వారు నమ్మిన దేవుడు సంతుష్ఠుడవుతాడు.