
అత్తారింటి నుంచి ఈడ్చుకెళ్లిన తల్లిదండ్రులు
అడ్డొచ్చిన భర్త, కుటుంబ సభ్యులపై దాడి
ప్రేమ వివాహం చేసుకుందని యువకుడి ఇంటికెళ్లి వారిపై యువతి కుటుంబ సభ్యులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర మండలంలో జరిగింది.
నర్సంపల్లికి చెందిన ప్రవీణ్, అదే గ్రామానికి చెందిన శ్వేత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. ఈసీఐఎల్ లోని ఆర్య సమాజ్ లో వీరి వివాహం జరిగింది. మూడు నెలలుగా సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్నారు.
అయితే, ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారం రోజుల క్రితం సొంతూరు నర్సంపల్లికి వెళ్లారు. శ్వేత తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రవీణ్ తో కలిసి ఉంటున్న శ్వేతను ఎలాగైనా తీసుకెళ్లిపోవాలని ఆమె తల్లిదండ్రులు డిసైడ్ అయ్యారు.
శ్వేత నర్సంపల్లికి వచ్చిందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు బంధువులతో కలిసి ప్రవీణ్ ఇంటికి వెళ్లారు. యువకుడి ఇంటిపై యువతి తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు.
కారం పొడి చల్లారు. కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అనంతరం శ్వేతను బలవంతంగా అక్కడి నుంచి కారులో ఎత్తుకెళ్లారు. శ్వేత కళ్లకు వస్త్రం కట్టి ఎత్తుకెళ్లారు.
ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రవీణ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమపై దాడి చేశారని, తన భార్యను బలవంతంగా ఎత్తుకెళ్లారని పోలీసులకు పిర్యాదు చేశాడు ప్రవీణ్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.




