భార్యను కాపాడబోయి కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో తీవ్ర విషాదం నెలకొంది. దండెంపై ఉన్న బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్ దంపతులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
వైరా పట్టణంలోని హనుమాన్ బజార్ లో పల్లపు ఆంజనేయులు, నర్సమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి సమయంలో ఇనుప దండెంపై ఉన్న టవల్‌ను తీసే ప్రయత్నంలో నర్సమ్మకు కరెంట్ షాక్ కొట్టింది.
ఇది గమనించిన భర్త ఆంజనేయులు ఆమెను తప్పించబోయాడు. ఈ క్రమంలో ఆయనకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా దుస్తులు ఆరేసేందుకు ఏర్పాటు చేసుకున్న జీఏ తీగకు విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.