బహిర్భూమికి వెళ్లిన యువతిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చీరాల: బహిర్భూమికి వెళ్లిన యువతి(21)పై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హతమార్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వలస వచ్చిన బాధితురాలి కుటుంబం చీరాల రూరల్‌ మండలం ఈపూరుపాలెంలోని సీతారామపురంలో నివసిస్తోంది. ఇంటర్‌ పూర్తి చేసిన బాధితురాలు రెండేళ్లుగా ఇంటి వద్ద టైలరింగ్‌ పనులతో కుటుంబానికి ఆసరాగా ఉంటోంది.ఆమె తల్లిదండ్రులు చేనేత మగ్గం పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. …

బహిర్భూమికి వెళ్లిన యువతిపై లైంగిక దాడికి పాల్పడి హత్య

చీరాల: బహిర్భూమికి వెళ్లిన యువతి(21)పై లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హతమార్చిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వలస వచ్చిన బాధితురాలి కుటుంబం చీరాల రూరల్‌ మండలం ఈపూరుపాలెంలోని సీతారామపురంలో నివసిస్తోంది.

ఇంటర్‌ పూర్తి చేసిన బాధితురాలు రెండేళ్లుగా ఇంటి వద్ద టైలరింగ్‌ పనులతో కుటుంబానికి ఆసరాగా ఉంటోంది.ఆమె తల్లిదండ్రులు చేనేత మగ్గం పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. బాధితురాలు పెద్ద కుమార్తె. శుక్రవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్దకు బహిర్భూమికి వెళ్లిన బాధితురాలు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానంతో తండ్రి వెళ్లి చూడగా శరీరంపై దుస్తులు లేకుండా నిర్జీవంగా పడి ఉండటం చూసి భీతిల్లిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తును ముమ్మరం చేసేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేస్తామన్నారు. కొందరు యువకులు మద్యం తాగుతూ బహిర్భూమికి వెళ్లే మహిళల పట్ల ఆ ప్రాంతంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

గంజాయి ముఠా పనే!
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత సాయంత్రం ఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పోయిన ప్రాణాన్ని తీసుకురాలేమని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని మృతురాలి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అనంతరం చీరాల ఏరియా వైద్యశాలలో యువతి మృతదేహాన్ని పరిశీలించారు.

బాధితురాలిపై గంజాయి ముఠా అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటన కలిచివేసిందన్నారు. చేనేత మగ్గం పనులపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబంలో యువతి హత్యకు గురికావడం దారుణమన్నారు.

48 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేస్తామని ప్రకటించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.

రాష్ట్రంలో నార్కోటెక్‌ సెల్‌ ఏర్పాటుకు పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. గంజాయి ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేయాను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అందజేశారు.

Updated On 22 Jun 2024 10:02 AM IST
cknews1122

cknews1122

Next Story