ప్రతిపక్షాల కాకి గోలని తల తన్నేలా ప్రభుత్వం పనిచేస్తుంది : మంత్రి పొంగులేటి
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై తమదైన రీతిలో మండిపడ్డారు.గత ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు.
ఖమ్మం జిల్లా అరెంపల గ్రామంలో ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో రైతుని రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయం. మా ప్రభుత్వం పేదోడి కోసం పని చేసే ప్రభుత్వమంటూ నేను మనసుపూర్తిగా చెబుతున్నా.
ప్రతిపక్షాల కాకి గోలని తల తన్నేలా మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వం మాదిరిగా పది సంవత్సరాలు రుణమాఫీ ఇచ్చేయకుండా మాయ మాటలు చెప్పి గడిపినట్లుగా మా ప్రభుత్వం ఉండబోదు.
ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. రుణమాఫీ చేసి తీరుతాం. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి పోయింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నేడు కుంగిపోయింది.
ఓ పక్క ఆ ఏడు లక్షల కోట్ల రూపాయలకు అప్పు కట్టాల్సి వస్తుంది.. మరో పక్క పేదోడి గౌరవాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తున్నది’ అంటూ మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కూడా గత ప్రభుత్వంపై మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్షల కోట్ల అప్పులు చేసి పోయిందన్నారు.
ఎన్‌హెచ్- 65 పై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించామంటూ మంత్రి పేర్కొన్నారు. మొత్తం 17 బ్లాక్ స్పాట్ల వద్ద తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా చిట్యాల వద్ద రూ. 40 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. రూ. 30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు.