సంవత్సరంలోపే అన్ని సమస్యలకు పరిష్కారం
- అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు
- ఖమ్మం రూరల్ మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- రుణమాఫీని స్వాగతిస్తూ ఆరెంపుల గ్రామంలో మంత్రికి పాలాభిషేకం
ఖమ్మం రూరల్ : రాబోయే సంవత్సరంలోపే పాలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతానని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
ఖమ్మం రూరల్ మండల పర్యటనలో భాగంగా కైకొండాయిగూడెం , టీఎన్జీవోస్ కాలనీ, సాయి గణేష్ నగర్, సాయి ప్రభాత్ నగర్, నాయుడుపేట, ఆరెంపుల గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన తనను గెలిపించినందుకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరగలేదని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని పేదవారి ప్రభుత్వం తెచ్చుకున్నారని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అందరికీ న్యాయం చేస్తామని చెప్పానని తప్పకుండా రాబోయే సంవత్సరం లోపే నియోజక వర్గంలోని ప్రధాన సమస్యలంటిని పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు.
గత పది సంవత్సరాల్లో పేదలకు ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాబోయే మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదని తెలిపారు.
తమ హయంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్ లు ఇస్తామన్నారు. లింక్ రోడ్లన్నీ పూర్తి చేయిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో రైతును రాజు చేయాలనే సంకల్పంతో రాబోయే రెండు నెలల్లోనే 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నామని మరోమారు స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు.
ప్రతిపక్షాల కాకి గోలను తలదన్నే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వం లో 7 లక్షల కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కృంగి పోయి కొట్టుకు పోయిందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టాల్సి వస్తుందని తెలిపారు. అదేవిధంగా నాయుడుపేట గ్రామంలో ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
అలాగే రుణమాఫీని స్వాగతిస్తూ ఆరెంపుల గ్రామంలో బండి జగదీష్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.