నా కార్యాలయంలో ఫొటోలు పెట్టేందుకు మీరెవర్రా నంద్యాల వార్డు సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు ఏర్పాటు చేసేందుకు వెళ్లిన తెదేపా నాయకులను పురపాలక ఛైర్‌పర్సన్‌ అడ్డుకున్న ఘటన నంద్యాలలో శనివారం చోటుచేసుకుంది. తెదేపా నాయకులు తెలిపిన వివరాల మేరకు.. 29వ వార్డు తెదేపా ఇన్‌ఛార్జి మంజుల సుబ్బరాయుడు, నాయకులు తిమ్మయ్య, రామకృష్ణ, నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలను ఏర్పాటు చేసేందుకని స్థానిక సచివాలయానికి వెళ్లారు. విషయాన్ని అక్కడ పనిచేస్తున్న …

నా కార్యాలయంలో ఫొటోలు పెట్టేందుకు మీరెవర్రా

నంద్యాల వార్డు సచివాలయంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు ఏర్పాటు చేసేందుకు వెళ్లిన తెదేపా నాయకులను పురపాలక ఛైర్‌పర్సన్‌ అడ్డుకున్న ఘటన నంద్యాలలో శనివారం చోటుచేసుకుంది.

తెదేపా నాయకులు తెలిపిన వివరాల మేరకు.. 29వ వార్డు తెదేపా ఇన్‌ఛార్జి మంజుల సుబ్బరాయుడు, నాయకులు తిమ్మయ్య, రామకృష్ణ, నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలను ఏర్పాటు చేసేందుకని స్థానిక సచివాలయానికి వెళ్లారు.

విషయాన్ని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు ఛైర్‌పర్సన్‌కు సమాచారమిచ్చారు. తెదేపా నాయకులు సిబ్బందితో మాట్లాడుతుండగానే పురపాలక ఛైర్‌పర్సన్‌ మాబున్నిసా, ఆమె భర్త జిలానీ, తమ్ముడితో పాటు మరికొందరు వచ్చారు.

ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. నా వార్డు సచివాలయానికి రావడానికి మీరెవరు, నా కార్యాలయంలో ఫొటోలు పెట్టేందుకు మీరెవర్రా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో కూర్చున్న తెదేపా నాయకులను బయటకు వెళ్లాలని దుర్భాషలాడారు.

సచివాలయ సిబ్బందిని కూడా మీకు మెమోలు ఇప్పిస్తానంటూ హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తెదేపా దళిత నాయకుడిని కులం పేరుతో దూషిస్తూ గొడవకు దిగారు. ముఖ్యమంత్రి ఫొటోలు పెడితే సహించేది లేదని పురపాలక ఛైర్‌పర్సన్‌ మొండికేశారు.

మూడో పట్టణ సీఐ నరసింహులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. తెదేపా నాయకులు మంజుల సుబ్బరాయుడు, తిమ్మయ్య ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు:29వ వార్డు సచివాలయానికి వెళ్లిన దళిత నాయకుడు తిమ్మయ్యను కులం పేరుతో దూషించిన పురపాలక ఛైర్‌పర్సన్‌ మాబున్నిసా, ఆమె భర్త జిలానీ, తమ్ముడు రషీద్‌తో పాటు సచివాలయ అడ్మిన్‌ రమేశ్‌పై ఎస్సీ, ఎస్టీ, కేసు నమోదు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు.

శనివారం సొంత పనిమీద సచివాలయానికి వెళ్లిన తనను ఛైర్‌పర్సన్, ఆమె భర్త ఇతరులు మా సచివాలయానికి ఎందుకొచ్చావని కులం పేరుతో దూషించారని తిమ్మయ్య ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Updated On 23 Jun 2024 12:24 PM IST
cknews1122

cknews1122

Next Story