కేసీఆర్ కు మరోసారి పవర్ కమిషన్ నోటీసులు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి మరోసారి నోటీసులు జారీ చేశారు. చత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కమిషన్ ముందు వివరణ ఇవ్వడానికి, ఆధారాలు సమర్పించేందుకు, సాక్షులను క్రాస్‌ఎగ్జామిన్ చేసేందుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952 సెక్షన్ 8బీ, …
కేసీఆర్ కు మరోసారి పవర్ కమిషన్ నోటీసులు
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి మరోసారి నోటీసులు జారీ చేశారు.
చత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కమిషన్ ముందు వివరణ ఇవ్వడానికి, ఆధారాలు సమర్పించేందుకు, సాక్షులను క్రాస్‌ఎగ్జామిన్ చేసేందుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
ఈ మేరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952 సెక్షన్ 8బీ, 8సీ కింద ఈ నెల 19నే నోటీసులు ఇచ్చారు. "పబ్లిక్నోటీసు ఆధారంగా కొందరు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యారు.
వాళ్ల వాదనలు రికార్డు చేశాం. ఇందులో కోర్టు విట్నెస్కింద కె.రఘు, కోదండరాం, తిమ్మారెడ్డి, వేణుగోపాల్‌రావు, గోపాలకృష్ణన్ఉన్నారు. మీరు వ్యక్తిగతంగా హాజరై తగిన ఆధారాలను సమర్పించేందుకు, కమిషన్‌ముందు వాదనలు వినిపించేందుకు, విట్నెస్లను క్రాస్‌ఎగ్జామిన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం' అని అందులో పేర్కొన్నారు.
ఇందుకు ఈ నెల 27 వరకు గడువు ఇస్తున్నామన్నారు. కాగా, కమిషన్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ను రద్దు చేయాలని కోరారు.
11న తొలిసారి నోటీసులు..
ఈ నెల 11న కేసీఆర్ కు కమిషన్ తొలిసారి నోటీసులు ఇచ్చింది. 15లోగా వివరణ ఇవ్వాలని అప్పట్లో ఆదేశించింది. అయితే దీనిపై కమిషన్ కు కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు.
రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని అందులో ఆరోపించారు. "ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు వేయకూడదన్న కనీస ఇంగీతం కూడా రేవంత్ ప్రభుత్వానికి లేదు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన మీరు.. ప్రభుత్వ నిర్ణయం సరికాదని సూచించకుండా, బాధ్యతలు స్వీకరించడం విచారకరం' అని జస్టిస్ నర్సింహారెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాగా, కేసీఆర్ లేఖ రాసిన తర్వాత 9 రోజులకు ఆయనకు కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చింది.