పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని చెప్పారు.
వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉందన్నారు. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్‌ను సమయం కోరామన్నారు. ఈ రోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారని అన్నారు.
గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వీరిద్దరి సభ్యత్వాలు రద్దు కావాలన్నారు. స్పీకర్ సమయం ఇస్తారని భావిస్తున్నామని చెప్పారు.పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నారన్నారు. మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై దాడి చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి తోకలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
జీవన్ రెడ్డి మాట మీద నిలబడాలని చెప్పారు. తాము ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రజల ముందు దోషిగా నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు.స్పీకర్ న్యాయంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నామన్నారు. రేవంత్ భయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పదవిని కాపాడుకోవటానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా అన్నారు. కేసీఆర్‌ని రోజు తాము కలుస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పు తర్వాతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి రావచ్చని అన్నారు. కమిషన్ విచారణ వద్దనటం లేదని..జస్టిస్ నర్సింహ రెడ్డిని తప్పించాలని కోరుతున్నామని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.