తెలంగాణాలో లోకేష్ రెడ్ బుక్ ఎఫెక్ట్.. ఆ ఎమ్మెల్యే బ్లాక్ బుక్!!
తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఎన్టిపిసి ఫ్లై యాష్ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది.ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ రచ్చ కొనసాగిస్తున్నారు.
*పొన్నం ప్రభాకర్ కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్*
అవినీతి చెయ్యకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ ఫిలింనగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని ఆయన కోసం ఎదురు చూశారు. పొన్నం రాకపోతే ఆయన తప్పు ఒప్పుకున్నట్టేనని పేర్కొన్నారు.
బ్లాక్ బుక్ రాస్తానన్న ఎమ్మెల్యే పాడి
అయితే ఆలయానికి పొన్నం ప్రభాకర్ రాకపోవటంతో పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్ల కుంభకోణం చేశాడని నిరూపితమైందని పేర్కొన్నారు.
అంతే కాదు తాను పొన్నం ప్రభాకర్ పేరుతో బ్లాక్ బుక్ రాస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇక ఈ ప్రకటనతో పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఏపీలో లోకేష్ రాసినట్టు తెలంగాణాలో పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్
ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాసినట్టు, తెలంగాణాలో పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు బ్లాక్ బుక్ రాస్తానని చెబుతున్నారని చర్చించుకుంటున్నారు.
నిన్నటికి నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు చేసిన సవాల్ ను స్వీకరించి చెల్పూర్ ఆలయం వద్ద ఎటువంటి అవినీతి చేయలేదని ప్రమాణం చేయడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు.
ముదురుతున్న వార్ :
దీంతో ఆయన వీణవంకలోని తన ఇంటివద్దనే తడి వస్త్రాలతో ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు.
ఈ సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు మరోమారు సవాల్ విసిరారు. మొత్తానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వార్ గట్టిగానే సాగుతుంది.