కేయూ హాస్టల్‌లో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థిని తలకు గాయం
వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని (Kakatiya University) హాస్టల్‌లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లునావత్ సంధ్య కేయూలోని పోతన హాస్టల్ రూమ్ నం.19లో ఉంటూ పొలిటికల్‌సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నది.
ఈ క్రమంలో హాస్టల్‌లో గతి రాత్రి భోజనం చేసిన తరువాత తన గదికి వచ్చిన ఆమె.. మంచంపై ఉన్న వస్తువులు సర్దుకుంటుండగా, సీలింగ్ ఫ్యాను ఒక్కసారిగా ఊడి పైన పడటంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది.
దీంతో తోటి విద్యార్థినులు వెంటనే ఆమెను హాస్టల్ సూపర్‌వైజర్ శోభ సహాయంతో ప్రైవేటు దవాఖానకు తరలించారు. వైద్యులు ఆమె గాయానికి 14 కుట్లు వేశారు. ప్రమాద ఘటనను నిరసిస్తూ విద్యార్థినులు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఆమెకు గాయపడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హాస్టల్‌లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పాత భవనంలో ఎప్పుడో బిగించిన ఫ్యాన్లు అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం వాటికి మరమ్మతులు చేయించడం లేదని ఆరోపించారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
హాస్టల్‌లో బాత్‌రూమ్‌లు కూడా సరిగా లేవని, కలుషితమైన తాగు నీటికే సరఫరా చేస్తున్నారని విమర్శించారు. దీంతో రిజిస్ట్రార్, హాస్టల్స్ సూపర్‌వైజర్ అక్కడికి చేరుకుని అన్ని సమస్యలను రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ధర్నా విరమించారు.