
CM రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ధర్నా..
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. జూబ్లిహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిలోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ PDSU ఆధ్వర్యంలో విద్యార్థులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ చర్యలను పోలీసులు అడ్డుకున్నారు.
మాధాపూర్ వైపు నుంచి వచ్చిన ఆందోళనకారులు సీఎం ఇంటివైపుగా దూసుకెళ్లారు. పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు.
సీఎం ఇంటివైపుగా వస్తున్న ఆందోళకారులను అడ్డుకోవడంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రేవంత్ రెడ్డి ఇంటివైపుగా ఆందోళనకారులను వెళ్లనీయకుండా అడ్డగించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మాధాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
జాబ్ క్యాలెండర్, జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని రెండు రోజుల క్రితం నిరుద్యోగులు కూడా సచివాలయ ముట్టడికి యత్నించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తమ నిరసన వ్యక్తం చేసినట్టు ఆందోళనకారులు తెలిపారు.
ఇప్పుడు ఫీజులు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు ఉద్యమ బాటపట్టారు. హామీల అమలు సంగతేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూంటే… బకాయిలు, ఉద్యోగాల కోసం యువత ఆందోళనబాట పడుతోంది.