మహిళలపై దాడిని ఖండిస్తూ ప్రజా సంఘాల నిరసన
భూ మాఫీయా దౌర్జన్యాలను, దందాలను
వ్యతిరేకించాలని డాక్టర్ కె వి . కృష్ణారావు పిలుపు
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : భూమికి సంబంధించిన వివాదం కోర్టు పరిధిలో ఉండగా కొందరు భూ మాఫీయా గా తయారై స్థలం తమదేనంటూ ఆ భూమిలో ప్రవేశించి, అక్కడున్న మహిళలపై దౌర్జన్యం , పాశవిక దాడి చేయడానికి ఖండిస్తూ ఆదివారం జిల్లా పరిషత్ సెంటర్ లో పలు ప్రజా సంఘాలు నిరసన ప్రకటించాయి.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక , వీర నారీమణుల ఆశయ సాధన సమితి , మహాత్మ జ్యోతిబా పూలే ఐడియాలజీ సొసైటీ బాధ్యులు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి. కృష్ణారావు మాట్లాడుతూ మహిళలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
ఒక స్థల వివాదం కోర్టు పరిధిలో ఉండగా ఇరుపక్షాలు ఆ స్థలంలో ప్రవేశించకూడదని , కోర్టు తుది తీర్పు వచ్చేవరకు ఉండకుండా వాసిరెడ్డి శ్రీనివాస్ మరి కొందరు ఆ స్థలంలో ప్రవేశించి , ఈ స్థలం తమదేనంటూ మహిళలపై దాడికి దిగటం హేయమైన చర్య అన్నారు.
ఇలా ఒకసారి కాకుండా పలుసార్లు కూడా దాడులకు పాల్పడటం గమనిస్తుంటే కొంతమంది స్థానిక అధికారుల అండదండలు ఉన్నట్లు కనిపిస్తుందనీ ఆరోపించారు. ఖమ్మం నగరంలో ఒక భూ మాఫియా కొత్తగా తయారై భూ దందాలకు పాల్పడుతున్నట్లుగా ఈ ఉదంతం స్పష్టం చేస్తుందన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదు వలె ఖమ్మం నగరంలో కూడా భూ మాఫియా తయారైందని , అధికారులు దీనిపై దృష్టి సారించకుండా వదిలి వేస్తే ప్రభుత్వ భూములను కూడా ఈ మాఫియా కబ్జా చేయడం ఖాయమన్నారు. ఈ స్థలం తమదే అని అంటున్న వాసిరెడ్డి శ్రీనివాస్ ఇందులో రాజకీయ నాయకులను లాగడం ఎందుకని ప్రశ్నించారు.
రాజకీయ నాయకులు కూడా వాస్తవాలను పరిశీలించకుండా గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్మడం సమాజ సం కాదన్నారు. కోర్టు, పోలీసుల వ్యవస్థ ఉండగా క్రిమినల్స్ తరహాలో వాసిరెడ్డి శ్రీనివాస్ వంటి వ్యక్తులు చట్టాన్ని తమ చేతులు తీసుకోవడం ఏమాత్రం భావ్యం కాదన్నారు.
పదేపదే ఈ విధమైన దౌర్జన్యాలకు పాల్పడితే క్షమించేది లేదని , ప్రజాస్వామ్య బద్దంగానే తాము ఈ సమస్యను ఎదుర్కొంటామని , దీనిపై మరింత ఆందోళన కార్యక్రమాలను తలపెడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ ,మహాత్మ జ్యోతిబా పూలే ఐడియాలజీ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పేల్లూరి విజయకుమార్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు బాలిని భాస్కర్ రెడ్డి , దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , బాధితులు చేపూరి సంధ్యారాణి , శ్రావణి , నైనీషా,
మలీదు నవజ్యోత్ , వీర నారి మణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి , జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడాల ఝాన్సీ , ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పగిడిపల్లి నాగేశ్వరావు, రవీందర్ నాయక్ , మహిళా నాయకురాలు అనంత లక్ష్మి , ధనలక్ష్మి, స్వరూప ,చంద్రకళ, జయ, మరియ కుమారి ,జ్యోతి, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.