
కవితకు మరో షాక్!..టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఔట్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటిదాకా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఆమెను ఆ స్థానం నుంచి తప్పించారు.
బుధవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన టీబీజీకేఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్‌ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇప్పటికే ఆయన్ను టీబీజీకేఎస్ ఇన్చార్జిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నామినేట్ చేసింది.
ప్రతిష్ఠాత్మక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లోని బీఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) గౌరవాధ్యక్షురాలిగా కవితను తొలగించింది పార్టీ.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఏకగ్రీవంగా నామినేట్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు టీబీజీకేఎస్ లో ఈ మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కల్వకుంట్ల కవిత స్థానంలో కొప్పుల ఈశ్వర్‌ను టీబీజీకేఎస్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కొప్పుల ఈశ్వర్‌ను ఈ పదవిలో నియమించాలని బీఆర్ఎస్ నెల రోజుల క్రితమే నిర్ణయించినప్పటికీ- అది ఇప్పటికి సాధ్యపడింది.
టీబీజీకేఎస్.. ఇకపై కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో సింగరేణి కాలరీస్ కార్మికులు, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుందని బీఆర్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.
సింగరేణికి కొత్త బొగ్గు గనులను మంజూరు చేయడం, ఆదాయపు పన్నులో మినహాయింపులు.. వంటి అంశాలపై త్వరలోనే ఢిల్లీలో సింగరేణి బచావో పేరుతో ఉద్యమ పోరాటాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించింది.
ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు- కల్వకుంట్ల కవితను పార్టీ గానీ, బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు గానీ సంప్రదించలేదని సమాచారం. ఏకపక్షంగా బీఆర్ఎస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి.
టీబీజీకేఎస్‌లో కవిత స్థానంలో కొప్పుల ఈశ్వర్‌ను నియమించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కవితను పార్టీ, దాని అనుబంధ సంస్థల నుండి క్రమంగా దూరం చేసే మరో ప్రయత్నంగా భావిస్తున్నారు.
బీఆర్ఎస్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇటీవలి కాలంలో కేటీఆర్, కవిత మధ్య పెరుగుతున్న రాజకీయ విభేదాలకు మరో ఉదాహరణగా చెబుతున్నారు. కవితను సంప్రదించకుండా ఆమెను తొలగించడాన్ని నిరసిస్తూ పలువురు టీబీజీకేఎస్ నాయకులు బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ బేరర్ పదవులకు రాజీనామా చేశారు.
సర్వసభ్య సమావేశంలో ఎటువంటి చర్చ చేపట్టకుండానే కవితను తొలగించడం సరికాదని అన్నారు. సంఘం ఏర్పాటైన తరువాత తొలిసారిగా ఇలాంటి పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు.