అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సికె న్యూస్ ప్రతినిధి
కూసుమంచి : అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం , సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ , ఇతర శాఖల అధికారులతో పాలేరు నియోజకవర్గంలో చేపట్టిన పనుల పురోగతి, చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. వివిధ శాఖలకు సంబంధించి నియోజకవర్గంలో చేపడుతున్న పనుల పూర్తికి అధికారులు వ్యక్తిగత శ్రద్ధ చూపాలన్నారు.
నియోజకవర్గ పరిధిలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖచే నియోజకవర్గ పరిధిలో సిఆర్ఆర్, ఎంఆర్ఆర్, పిఎంజిఎస్ వై, ఎస్డీఎఫ్, సాట్స్, ఎన్ హెచ్ఎం, ఎంపిలాడ్స్, డిఎంఎఫ్టి, ఏఏపిసి, పిఎంఏఏజివై, జిపి వర్క్స్, ఇజిఎస్ తదితర గ్రాంట్ల క్రింద రూ. 11904.48 లక్షల అంచనాలతో 964 పనులు మంజూరు కాగా, 577 పనులు పూర్తయినట్లు, 91 పనులు పురోగతిలో వుండగా, 296 పనులు ఇంకనూ ప్రారంభం కాలేదని తెలిపారు.
పురోగతిలో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని, ఇంకనూ ప్రారంభం కాని పనులు ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. రోడ్లు, భవనాల శాఖచే ఇతర ప్లాన్, ప్లాన్, నాన్ ప్లాన్, ఆర్డీఎఫ్, ఎస్సిఎస్డీఎఫ్, ఎస్టీఎస్డీఎఫ్, సీఆర్ఎఫ్ పద్దుల క్రింద చేపట్టిన పనుల పూర్తికి కార్యాచరణ చేసి, పనుల పరిస్థితిపై నివేదిక సమర్పించాలన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ నుండి రోడ్లు భవనాల శాఖ స్వాధీనం చేసుకొనే రోడ్ల ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మంజూరు కావాల్సిన, ప్రభుత్వానికి డివియేషన్ కొరకు పంపాల్సిన పనుల వివరాలు సమర్పించాలన్నారు.
ఏ ఏ రోడ్లకు కేంద్రం నుండి, ఏ ఏ రోడ్లకు రాష్ట్రం నుండి నిధుల సేకరణ చేయాలో కార్యాచరణ చేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలో 13 ఆరోగ్య ఉపకేంద్రాలకు భవనాల నిర్మాణం చేపట్టగా, 9 నిర్మాణాలు పూర్తి అయినట్లు, మిగతావి ప్రగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు.
చెల్లింపులు హోల్డ్ లో ఉన్న పనులు, చాలా కాలం నుండి చెల్లింపులకు వేచివున్న పనుల వివరాలు సమర్పించాలన్నారు. స్థల సమస్యలు ఉన్న పనులు శాఖల సమన్వయం తో వెంటనే పరిష్కారం చేయాలని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులకు స్థల సేకరణ కు సహకరించాలన్నారు.
ప్రజల నుండి స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తికి చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామ సభలు చేపడుతున్నది అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ అభివృద్ధి పనులకు భూసేకరణ వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, ఇఇ వెంకట వేణు, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, నియోజకవర్గ మండలాల తహశీల్దార్లు, పీఆర్, ఆర్ అండ్ బి శాఖల డిఇ లు, ఏఇ లు తదితరులు పాల్గొన్నారు.