రైతులకు ప్రతి దశలో అండగా ఉంటా… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సీకె న్యూస్ ప్రతినిధి ఖమ్మం : నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో వరి నాట్లున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు …

రైతులకు ప్రతి దశలో అండగా ఉంటా… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సీకె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం : నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో వరి నాట్లున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయంలో నారుమడి దగ్గరి నుంచి రైతులు పంట కోసి అమ్మకం చేసే వరకు ప్రతి దశలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తూ అధిక లాభం పొందే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. నాట్లు వేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది,

పంటకు రోగాలు వస్తే వాడే పురుగు మందులు, ఎరువుల లభ్యత పురుగు మందుల లభ్యత, పంట దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం మిల్లులకు తరలింపు, రైతులకు జరిగే చెల్లింపు, తదితర ప్రతి దశలో రైతులకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని అన్నారు.

నూతన సాగు పద్ధతులను రైతులకు వివరిస్తూ, తక్కువ పెట్టుబడితో అధిక లాభం వచ్చే విధంగా సూచనలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పంట కొనుగోలు సమయంలో వరి ధాన్యం తరుగు గురి కాకుండా జల్లెడ పట్టి, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులతో కలిసి పొలంలో వెదజల్లే పద్దతిలో వరి నాటు పద్ధతిని గమనించి, పొలంలో దిగి స్వయంగా చేపట్టారు.

వ్యవసాయ క్షేత్రం ప్రక్కనే రైతులతో నేలపై కూర్చుని వ్యవసాయ పద్ధతులు, పెట్టుబడి ఖర్చు, దిగుబడి, మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధునిక పద్ధతులు అవలంభించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేలా చూసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. ధరణి దరఖాస్తులపై సమస్యలు అడిగి తెలుసుకుని, వారికి సమాధానాలు ఇచ్చారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయనిర్మల, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నర్సింహారావు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.

Updated On 5 July 2024 9:11 PM IST
cknews1122

cknews1122

Next Story