అందుబాటులో లేని పశువైద్యులు
సకాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత
ఆసుపత్రి ముందు రైతులు ఆందోళన
సి కె న్యూస్ షాద్ నగర్: జులై 9
కేశంపేట మండల కేంద్రంలోని పశువుల ఆసుపత్రి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయని రైతులు మండల కేంద్రంలోని పశువుల ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.
గత కొన్ని నెలల నుండి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది ఇష్టానుసారంగా విధులకు హాజరవుతుండడంతో విసుగు చెందిన రైతులు మంగళవారం నిరసనకు దిగి వైద్య సిబ్బందిని నిలదీశారు.
పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు ఫోన్ చేస్తే ఎత్తక పోవడంతో రైతులు గోపాల మిత్రులను సంప్రదిస్తే వేలకు వేలు రైతుల నుండి ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. పశువుల ఆసుపత్రిలో మందులు పుష్కలంగా ఉన్న రైతులకు ఇవ్వకుండా బహిరంగ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు తమ ఇష్టానుసారంగా విధులకు హాజరవడంతోపాటు రైతులకు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు ఉన్నాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తుండడంతో తమ పశువులు మృత్యువాత పడుతున్నాయని వారు పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డికి మండల రైతులు ఫిర్యాదు చేశారు.