రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.ఈ పథకం కింద ప్రతి రైతుకుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు అవుతారు. 09-12-2023 తేదీ నాటికి బకాయి వున్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి వుంటుంది. తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2.00 లక్షల (రూపాయలు రెండు లక్షలు) వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది.
వ్యవసాయాన్ని లాభసాటిగా, స్థిరంగా కొనసాగేలా చేయటానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుంది. తెలంగాణ ఆర్ధిక వృద్ధికి వ్యవసాయ రంగం ఒక కీలకమైన పునాది, వ్యవసాయ, అనుబంధ రంగాలు తెలంగాణ గ్రామీణ జనాభాలో 66 శాతం మందికి ఉపాధిని సమకూర్చుతూ జిఎస్ డిపికి 15.8 శాతం తోడ్పాటును అందిస్తుంది (డిఇఎస్ డేటా ప్రకారం 2023-2024 ఎఇ). అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగంగ్రామీణ ఆర్ధిక వ్యవస్థ వృద్ధికి అత్యవసరం. తెలంగాణ రైతులలో చిన్న, సన్నకారు రైతులు అధిక సంఖ్యలో వున్నారు.
- తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపర్చడానికి, పంటరుణాల మాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించింది. పంట రుణమాఫీ రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి, వారు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీపై కొత్త రుణాలు తీసుకోవడానికి మరియు అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండా ఉపయోగపడుతుంది. తద్వారా, అత్యవసర వ్యవసాయ ఇన్ పుట్ లు కొనుక్కోవడానికి అవకాశం కలుగచేస్తుంది. అధిక వడ్డీ రేట్ల ద్వారా తీవ్రతరం అయ్యే శాశ్వత రుణగ్రస్థత నుండి వారిని కాపాడుతుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థికస్థితిని దృష్టిలో వుంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా చూడటానికి, రాష్ట్రంలో రైతుల కోసం పంట రుణమాఫీ-2024 పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్రభుత్వం పంట రుణమాఫీ పథకం 2024 అమలు కోసం ఈ క్రింది మార్గదర్శకాలను నిర్ణయించింది.
- పంట రుణమాఫీ పథకం 2024 పరిధి, వర్తింపు :-
3.1 తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2.00 లక్షల (రూపాయలు రెండు లక్షలు) వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది.
3.2 ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
3.3 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
3.4 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
3.5 ఈ పథకం కింద ప్రతి రైతుకుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09-12-2023 తేదీ నాటికి బకాయి వున్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి వుంటుంది.
3.6 రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు (పిడిఎస్) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో, ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మున్నగు వారు ఉంటారు.
- పథకం అమలుకు ఏర్పాట్లు :-
4.1 వ్యవసాయశాఖ కమిషనర్ మరియు సంచాలకులు (డిఒఎ) పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా నిర్ణయించబడింది.
4.2 హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) ఈ పథకానికి ఐటి భాగస్వామి బాధ్యతలు నిర్వహిస్తారు.
4.3 వ్యవసాయశాఖ సంచాలకులు మరియు ఎస్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటి పోర్టల్ ను నిర్వహిస్తారు. ఈ ఐటి పోర్టల్ లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ ఐటి పోర్టల్ లో ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ కి బిల్లులు సమర్పించడం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి.
4.4 ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బిఎస్) నియమించాలి. ఈ బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయశాఖ సంచాలకులు మరియు ఎన్ఐసి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంక్ యొక్క పంటరుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలి.
4.5
ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సిబిఎస్) నుండి రిఫరెన్స్-1వ మెమో మరియు జత చేసినట్టి ప్రొఫార్మా-1లో డిజిటల్గా సంతకం చేసిన సంక్షిప్తిని ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సోసైటీలు సిబిఎస్ లో లేవు. కాబట్టి, పిఎసిఎస్ కు అనుబంధమైన సంబంధిత బ్యాంక్ బ్రాంచ్, రిఫరెన్స్- 2వ మెమో మరియు జత చేసినట్టి ప్రొఫార్మ-2లో డేటాను డిజిటల్గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి.
4.6 ప్రతి బ్యాంకు సిబిఎస్ నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ యొక్క ఉద్దేశ్యం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడం. అవసరమైతే వ్యవసాయశాఖ సంచాలకులు మరియు ఎన్ఐసి డేటా వాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి.
4.7 ఈ పథకం కింద లబ్ధిదారుల మరియు రైతుకుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణఖాతాలోని ఆధార్ ను పాస్ బుక్ డేటా బేస్ లో ఉన్న ఆధార్ తో మరియు పిడిఎస్ డేటాబేస్ లో ఉన్న ఆధార్ తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి 09-12-2023 నాటికి బకాయి ఉన్న సంచిత (క్యుములేటివ్) రుణమాఫీ రూ.2.00 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది.
4.8 అర్హతగల రుణ మాఫీ మొత్తాన్ని డిబిటి పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణఖాతాలకు జమచేయబడుతుంది. పిఎసిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేయడమవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పిఎసిఎస్ లో ఉన్న రైతు ఖాతాలో జమచేస్తారు.
4.9 ప్రతి రైతు కుటుంబానికి 09-12-2023 తేదీ నాటికి ఉన్న రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమచేయాలి.
4.10 ప్రతి రైతుకుటుంబానికి 09-12-2023 నాటికి కలిగిఉన్న మొత్తం రుణం కానీ లేక రూ.2.00 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది.
4.11 ఏ కుటుంబానికి అయితే రూ.2.00 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ.2.00 లక్షలకు పైబడివున్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత, అర్హతగల రూ. 2.00 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.
4.12 రూ. 2.00 లక్షల కంటే ఎక్కువ రుణం వున్న పరిస్థితులలో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్దతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.
4.13
మినహాయింపులు:
- ఈ రుణమాఫీ ఎన్హెచ్ఐలు, జెఎల్లు, ఆర్ఎంజిలు, ఎల్ఎసిఎస్లకు తీసుకున్న రుణాలకు వర్తించదు.
- ఈ రుణమాఫీ పునర్ వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు వర్తించదు.
- కంపెనీలు, ఫర్మ్స్ వంటి సంస్థలకి ఇచ్చిన పంటరుణాలకు వర్తించదు. కానీ పిఏసిఎస్ ద్వారా తీసుకున్న పంటరుణాలకు వర్తిస్తుంది.
- కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం-కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా వున్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోనికి తీసుకోబడుతుంది.
బ్యాంకుల యొక్క బాధ్యత :- ప్రతి బ్యాంకు (ప్రొఫార్మా -1 & II జతచేయనైనది ) లో డేటాను బాధ్యతగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ డేటాలో రైతుల అర్హత, ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణఖాతా వివరాలు సమాచార వాస్తవికత, సమగ్రత ఉండేలా సరియైన విధంగా ఇవ్వాలి. పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బిఎన్ఏ డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించిందని భవిష్యత్తులో కనుగొన్నట్లయితే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి.
రైతుల యొక్క బాధ్యతలు :- ఈ పథకం క్రింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినట్లయితే లేదా మోసపూరితంగా పంటరుణాన్ని పొందినట్లు లేదా పంట రుణమాఫీకి అర్హులుకారని కనుగొన్నట్లయితే, పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్టప్రకారం వ్యవసాయశాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది.
- ఆడిటు :- లోన్ అకౌంట్లలో ఉన్న డేటా యధార్ధతను నిర్ధారించేందుకు సహకారశాఖ సంచాలకులు మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందస్తు శాంపిల్ ప్రిఆడిట్ ను చేపట్టి, అమలు అధికారికి (వ్యవసాయశాఖ సంచాలకులు) వారు కనుగొన్న విషయాలను సమర్పించాలి.
- ఈ పథకం క్రింద లబ్ధి పొందిన ప్రతి రైతు బ్యాంకు అకౌంట్ ను ఆర్బిఐ/నాబార్డ్ నిర్దిష్ట కార్యవిధానం ప్రకారం ఆడిట్ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఆడిట్ ను చట్టబద్ధ (స్టాట్యుటరి) ఆడిటర్లు, ప్రత్యేక ఆడిటర్ల ద్వారా చేయించవచ్చును
- పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం:- పథకం గురించి రైతుల సందేహాలకు, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి. రైతులు తమ ఇబ్బందులను ఐటి పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్ద తెలుపవచ్చు. ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల లోపు పరిష్కరించి, దరఖాస్తుదారునికి తెలపాల్సి ఉంటుంది.