“కీలక” సంస్థల ఏర్పాటుకు దయాకర్ రెడ్డి స్థలాల పరిశీలన
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం రూరల్ : పాలేరు నియోజక వర్గ పరిపాలన సౌలభ్యం కోసం…. నాణ్యమైన విద్యను అతి తక్కువ ఖర్చు కే అందించేందుకు…. కులమత బేధాలు లేకుండా గురుకులాలు అన్ని ఒకే చోట ఉండేలా చొరవ చూపుతున్నారు
పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…. ఇందులో భాగంగా మంత్రి సూచనల మేరకు క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పలు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను బుధవారం పరిశీలించారు.
ఏసీపీ కార్యాలయం , రెవెన్యూ, రిజిస్ట్రేషన్ తదితర నియోజక వర్గ కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉంటే పరిపాలన సౌలభ్యంతో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే సదుద్దేశంతో ఖమ్మం రూరల్ మండలం తరుణి హాట్ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.
అతి తక్కువ ఖర్చులో కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు ముందుకు వచ్చిన స్వామి నారాయణ స్కూల్ యాజమాన్యానికి స్థలాన్ని ఇచ్చేందుకు శ్రీ సిటీ దగ్గర్లోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.
ఇందుకోసం తిరుమలాయపాలెం మండలంలోని మరో స్థలాన్ని కూడా పరిశీలించనున్నారు. అదేవిధంగా పొన్నెకల్ లో ఇంటిగ్రేటెడ్ గురులాల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు అన్ని ఒకే చోట ఉండి కులమత బేధాలు అనేవి లేకుండా ఉంటాయనేది ప్రభుత్వ సదాభిప్రాయం.
వీలైనంత త్వరగా మంత్రి పొంగులేటి చొరవతో వీటిని ఫైనల్ చేసి పాలేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ , శాఖమూరి రమేష్ , జొన్నల గడ్డ రవి, కొప్పుల చంద్ర శేఖర్, కొడాలి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.