తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సెమి రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ లోని అన్ని జిల్లాలో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటకు (Secondary Education System) ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం రేవంత్ (CM Revanth) ఆదేశించారు
శుక్రవారం సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులతో సమావేశం జరిపారు.
ఈ సమావేశంలో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీచేశారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచించారు.
అంగన్‌వాడీ ప్లే స్కూళ్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్‌వాడీల్లో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్‌ను నియమించాలని కోరారు.
గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు చేయాలనీ , మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అధికారులు కష్టపడి పని చేయాలన్నారు.
అందుకు విద్యావేత్తల విలువైన సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా చేపట్టాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాల్లో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు.
పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారుతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. కమిటీలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి నోడల్ అధికారిగా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 49 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, అందులో ఈ ఏడాది ఎనిమిది పాఠశాలల పనులు ప్రారంభానికి సిద్ధమని తెలిపారు. మరో 31 పాఠశాలలకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించాలని, మిగిలిన 10 పాఠశాలలకు కోసం భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు