ఐఐటీకి వెళ్లలేక.. మేకలకాపరి అనే వార్తపై స్పందించిన సీఎం రేవంత్
రూ. 3లక్షల కోసం గిరిజన విద్యార్థిని ఎదురుచూపు అందిన చేయూత
వీర్నపల్లి (సిరిసిల్ల): ఐఐటీలో చదవాలన్న ఆశ ఉన్నా.. ఆర్థికపరిస్థితి బాగాలేదు. ఎంతో కష్టపడి జేఈఈ మెయిన్ లో ప్రతిభ చాటి మంచి ర్యాంకు సాధించినా, కాలేజీ ఫీజుచెల్లించలేని దుస్థితిలో మేకల కాపరిగా మారింది.
విద్యాభిమానులు, దాతల సహకారం కోసం ఆ విద్యార్థిని ఎదురు చూస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ రాములు-సరోజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు.
ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయ పడుతున్నారు. మూడో కూతురు మధులత జేఈఈ మెయిన్ లో ప్రతిభ కనబరిచి ఎస్టీ కేటగిరీలో 824వ ర్యాంక్ సాధించింది. పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది.
అయితే రూ.3లక్షల ఫీజు చెల్లించలేని స్థితిలో మేకల వద్దకు వెళుతోంది. ఈనెల 27వ తేదీలోపు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంది అని వార్త సోషల్ మీడియాలో వైరల్ అయి అది కాస్తా సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరింది.. దీనిపై వెంటనే సీఎం స్పందించి విద్యార్థినికి చదువునే విధంగా కాలేజ్ లో సీటు ను కేటాయించారు.
రాజన్న సిరిసిల్లకు చెందిన మన తెలంగాణ బిడ్డ, బాదావత్ మధులతకు ఐఐటీ పాట్నాలో సీటు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేకపోతున్న విషయం నా దృష్టికి వచ్చింది.
పేదరిక కష్టాలను ఎదుర్కొని, ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు ముందుగా తనకు మనస్ఫూర్తిగా నా అభినందనలు.
ఏ ఆటంకం లేకుండా ఐఐటీలో తన చదువును కొనసాగించడానికి కావాల్సిన మొత్తాన్ని, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిన్ననే (23 జూలై, 2024) తెలంగాణ ప్రజా ప్రభుత్వం విడుదల చేసింది.
ఇకముందు కూడా తను ఇలాగే రాణించి, తెలంగాణకు మరింత మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా.