కస్తూరిబా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం :
సోమవారం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ రఘునాధపాలెం, కామేపల్లి, సింగరేణి మండలాల్లో పర్యటించి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయ ఆవరణ, లోపల పరిశీలించిన అదనపు కలెక్టర్, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
విద్యాలయంలో తరగతుల నిర్వహణ, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందించారా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజన, కాస్మెటిక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అందిస్తున్న ఆహారం రుచిగా, శుభ్రంగా ఉంటుందా, కోడి గుడ్డు, పండ్లు వంటి పౌష్టికాహారం అందిస్తున్నారా వివరాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. కూరగాయల, ఇతర వంట సామాగ్రి నిల్వలపై అధికారులకు సూచనలు చేశారు.
విద్యాలయాలలోని టాయిలెట్స్, హాస్టల్ ప్రాంగణం, వంట చేసే ప్రాంతాలను పరిశీలించారు. స్టోర్స్ లోని సరుకులను పరిశీలించారు. తాజా సరుకులను అందించాలని, హాస్టల్ లోపల, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అదనపు కలెక్టర్ అన్నారు.
అనంతరం సింగరేణి, ముదిగొండ, రఘునాధపాలెం, నేలకొండపల్లి తహసీల్దార్ల కార్యాలయాలను తనిఖీ చేసి ధరణి దరఖాస్తుల పెండింగ్, పరిష్కార సమస్యలపై ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. రోజువారి లక్ష్యం పెట్టుకొని, దరఖాస్తుల పరిష్కారం త్వరితగతిన అయ్యేలా కార్యాచరణ చేయాలన్నారు.