కార్ కు అడ్డొచ్చాడని SI వీరంగం…
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జూలై 28న ఓ ఎస్ ఐ వీరంగం సృష్టించాడు. రాత్రి సమయంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోని యూటర్న్ వద్ద ద్విచక్ర వాహనదారుడిపై తన ప్రతాపం చూపించాడు వనపర్తి జిల్లా పానగల్ ఎస్సై కళ్యాణ్. తన కారుకు ద్విచక్ర వాహనదారుడు అడ్డు రావడంతో ఆవేశానికి లోనైనా ఎస్సై ఒక్కసారిగా రెచ్చిపోయాడు.
వాహనంలో నుంచి దిగి విరుచుకుపడ్డాడు. పిడుగులు గుద్దుతూ అతనిపై దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మరోసారి దాడి చేశాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద రంజిత్ అనే టూవీలర్ యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఎస్‌ఐ కల్యాణ్, తన వాహనానికి అడ్డుగా వచ్చాడంటూ దురుసుగా ప్రవర్తంచాడు. అంతేకాదు రంజిత్‌ను అక్కడే చితకబాదాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అంతలా దాడి చేసిన ఎస్సై కళ్యాణ్ తిరిగి బాధితుడినే బెదరించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఒంటిపై రూ.70,000 విలువైన లాకెట్ మిస్ అయిందని, రాబరీ కేసు పెడతానని ఎస్సై కళ్యాణ్.. బాధితుడు రంజిత్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్నావని కేసు పెడతానంటూ హెచ్చరించాడు.
దీంతో విషయం బయటకు రాకుండా ఎస్సై జాగ్రత్త పడేందుకు ప్రయత్నించాడు. అయితే ఎస్సై కళ్యాణ్ వీరంగం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో ఉమ్మడి జిల్ల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేసిన సంఘటనలో ఎస్సై కళ్యాణ్ ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే సిసిఏ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించిన ఘటనపై మల్టీజోన్- II ఐజి పూర్తి విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా దాడి సమయంలో ఎస్సై మెడలో నుండి లాకెట్ కింద పడిపోయింది. ఆదే సమయంలో అటు వైపుగా వెళుతున్న వాహనదారుడు కింద పడిన లాకెట్ ను ఎత్తుకెళ్లాడు. ఈ మొత్తం దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు కావడం విశేషం. ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.