కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో దారుణం…
బాత్రూమ్లో ప్రసవించిన బాలిక…
చదువుకుంటున్న బాలిక గర్భం దాల్చి కాలేజ్ లోనే ప్రసవించిన ఘటన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తి కేజీబీవీ పాఠశాలలో బుధవారం జరిగింది.
ఈ వ్యవహారంపై అధికారులు సీరియస్‌గా స్పందించారు.
వెంటనే బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16ఏళ్ల బాలిక క్యాంపస్‌లో ని బాత్రూమ్లోనే ప్రసవించింది.
ఆ తర్వాత దాదాపు రెండు మూడు గంటలపాటు అందులోనే ఉండిపోయింది. దీంతో ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు బాత్రూమ్లోకి తొంగిచూడటంతో ప్రసవించిన విషయం బయటకు తెలిసింది.
బాలికను బయటకు రప్పించి విచారించారు. చీమకుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక జూన్ 19వతేదీన పాదర్తి వద్ద ఉన్న కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. చేరిన తర్వాత వారంరోజుల పాటు హోమ్‌సిక్ పేరుతో ఇంటికి పోయి తిరిగి కాలేజ్ కు వచ్చింది. రోజూ తరగతులకు హాజరవుతూనే ఉంది.
బుధవారం ఉదయం 11గంటల సమయంలో బాత్రూమ్లోకి పోయి ప్రసవించిందని కళాశాల ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్థానిక మహిళా పోలీసు ద్వారా విషయం తెలుసుకున్న కొత్తపట్నం ఎస్ఐ సాంబశివరావు కేజీబీవీకి వెళ్లి విచారణ జరిపారు.
కొత్తపట్నం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వైష్టవి కాలేజ్ కు వెళ్లి బాలికకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సుభద్ర, రిమ్స్ వైద్యశాల సిబ్బంది అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు.
కాగా బాలిక తొమ్మిది నెలల గర్భవతిగా కళాశాలలోనే రెండు నెలల పాటు చదువు కొనసాగిస్తుండగా ఆ విషయాన్ని కాలేజ్ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రసవానికి ముందు పడే వేదన అంతా ఇంతా కాదు.
ఆ సమయంలో కూడా బాలిక నొప్పులు పడుతున్న విషయం కూడా తమకు తెలియదని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. బాలిక బాత్రూమ్కు పోయి గంటల తరబడి రాకపోయేసరికి వెళ్లిచూడగా అసలు విషయం తెలిసిందని కళాశాల ప్రిన్సిపాల్ అంటున్నారు.
అప్పటి వరకు తమకు ఆ బాలిక గర్భవతి అని తెలియదని అంటున్నారు. కాగా బాలికకు జన్మించిన శిశువు మృతి చెందింది.
బాధితురాలిని వైద్యం కోసం రిమ్స్‌కు తరలించిన అధికారులు పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా బాలిక చీమకుర్తి మండలానికి చెందిన కారణంగా చీమకుర్తి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. బాలికను లైంగికంగా లొంగదీసుకున్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గర్భానికి గల కారణం ఎవరు?, ఎలా జరిగింది? తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, స్నేహితులు ఎవరు కూడా ఎలా గుర్తించలేదు అనేదే ప్రశ్న గా మారింది… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.