జగిత్యాలలో యువకుడి హత్య కలకలం…
పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు…
జగిత్యాలలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నించారా? లేక హత్య చేసిన అనంతరం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారా?
అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
గంజాయి మత్తే హత్యకు దారి తీసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలో చెందిన యువకుడు కందుల రాజశేఖర్ గౌడ్ స్నేహితుల దినోత్సవం రోజున రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
గ్రామ శివారులోని బీరప్ప ఆలయం వద్ద కాలిపోయి శవమై కనిపించాడు. నోట్లో మట్టి కొట్టి తలపై కర్రతో దాడి చేసి హత్య చేసినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి.
పెట్రోల్ పోసి నిప్పంటించగా కొంత కాలిపోయింది. ప్రాణం పోయాక పెట్రోల్ పోసి నిప్పంటించారా?.. లేక సజీవ దహనం చేసేందుకే యత్నించారా? అనేది తేలాల్సి ఉంది. నోట్లో మట్టి ఉండడంతో అరవకుండా మట్టి కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటిచినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మధ్యాహ్నం బయటికి వెళ్లిన వ్యక్తి రాత్రి వరకు తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళన గురయ్యారు. తెల్లవారే సరికి బీరప్ప ఆలయం వద్ద శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఫ్రెండ్ షిప్ డే రోజున మిత్రులే స్పాట్ పెట్టారా?
ఫ్రెండ్ షిప్ డే రోజున ఉదయం బయటికి వెళ్లిన రాజశేఖర్ గౌడ్ మధ్యాహ్నం ఇంటికొచ్చి పడుకున్నాడు. స్నేహితుడు ఒకరు వచ్చి తీసుకెళ్లాడని మృతుని తల్లిదండ్రులు రమేష్ గౌడ్, రాధా ఆరోపిస్తున్నారు.
గ్రామానికి చెందిన యువకుడు అతని మిత్రులే హత్య చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. హంతకులను తమకు అప్పగించాలని పూడూర్ లో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు.హంతకులను పట్టుకునే వరకు కదిలేది లేదని భీష్మించారు.
దీంతో కరీంనగర్ జగిత్యాల రూట్లో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి సల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసులు, గ్రామ పెద్దలు నచ్చజెప్పి త్వరలోనే హంతకులను పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తామని హామి ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.
పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
హంతకులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన జగిత్యాల డి.ఎస్.పి రఘుచందర్ నేతృత్వంలో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
హంతకుల కోసం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు ఎనిమిది మందిపై అనుమానం వ్యక్తం చేయగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్య కేసును త్వరలోనే చేధిస్తామని స్పష్టం చేశారు డిఎస్పీ రఘుచందర్.
గంజాయి మత్తే హత్యకు కారణమా?
గంజాయి మత్తే హత్యకు దారి తీసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామంలో కొందరు యువకులు గంజాయికి అలవాటు పడి హల్చల్ చేస్తున్నారనే విమర్శలున్నాయి.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా బీరప్ప ఆలయం వద్దకు చేరుకున్న గంజాయి బ్యాచ్ లో ఇద్దరు రాజశేఖర్ గౌడ్ పై దాడి చేసి హత్య చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మరో ఐదుగురు అక్కడే ఉన్నప్పటికీ చూచి చూడనట్లు వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజశేఖర్ గౌడ్ పై ఇద్దరు దాడి చేయగా స్క్రూటిపై పారిపోయేందుకు యత్నించగా కర్రతో తలపై బాదగా పడిపోయినట్లు తెలుస్తోంది. బైక్ తో సహా పడిపోయిన రాజశేఖర్ అరవకుండా నోట్లో మట్టి కొట్టి పడిపోయిన బైక్ నుంచి పెట్రోల్ తీసి అతనిపై పోసి నిప్పంటించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇద్దరిలో ఒకరు పూడూరు గ్రామానికి చెందినవారు కాగా మరొకరు మల్యాల మండలం గొర్రెగుండం కు చెందిన యువకుడని తెలుస్తుంది.
ప్రస్తుతం ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఎనిమిది మంది గంజాయి బ్యాచ్ లో రాజశేఖర్ గౌడ్ ఒకరు. ప్రస్తుతం రాజశేఖర్ పై దాడికి పాల్పడ్డ వ్యక్తి గంజాయి బ్యాచ్ లో కీలకమైన వ్యక్తని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గంజాయి వల్లే స్నేహితుల దినోత్సవం రోజున మిత్రుడు ప్రాణాలు కోల్పోయాడని గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గంజాయి నివారణకు ఇప్పటికే పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ పూడూరులో యువకుడు హత్య జరగడం పోలీసులకు సవాల్ గా మారింది.