బీజేపీలో ఎమ్మెల్యేల గ్రూపు వార్….!
దీనికి గల కారణం ఏంటి అనేదే ప్రస్తుతం చర్చగా మారింది..
రాష్ట్ర బీజేలో ఇంటర్నల్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకంపై పాత, కొత్త నేతల పంచాయతీ నడుస్తోంది.మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలకు, రాష్ట్ర నాయకత్వానికి మధ్య గ్యాప్ స్పష్టం కనిపిస్తుంది.
ఎమ్మెల్యేలనే కాదు బీజేఎల్పీ నేతగా వున్న యోలేటి మహేశ్వర్ రెడ్డిని సైతం రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదంట. అసలు కాషాయ పార్టీలో ఈ అంతర్గత యుద్దానికి కారణాలేంటి..?తెలంగాణ బీజేపీలో మరోసారి ఇంటర్నల్ వార్ తెర మీదకొచ్చింది. ఆ అంతర్గత పోరు ఆ పార్టీలో కొత్తేమీ కాకపోయినా.. తరచూ బయటపడుతూ రచ్చకెక్కుతుండటం పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పార్టీలో ముందు నుంచి ఉన్న నాయకులు, మధ్యలో వచ్చి గెలిచిన ఎంపీల మధ్య రచ్చ ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. దాన్ని సెటిల్ చేయలేక బీజేపీ పెద్దలు స్టేట్ ప్రెసిడెంట్ నియామకాన్ని పెండింగ్‌లో పెట్టేశారు.
ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం వర్సెస్ శాసన సభ్యుల మధ్య లుకలుకలు రచ్చకెక్కుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం, ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదని, ఏ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది.
కనీసం బీజేఎల్పీ నేతను సైతం రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంది. గెలిచిన వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి కొత్తగా అడుగుపెట్టారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్ ఇద్దరే అందులో సీనియర్లు.
అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పార్టీ నుంచి ఏయే అంశాలు ప్రస్తావించాలి..? ఏయే హామీలపై రాష్ట్ర సర్కార్‌ను ఇరుకున పెట్టాలనే అంశాలపై.. సబ్జెక్ట్ అందించే ప్రయత్నం కూడా రాష్ట్ర నాయకత్వం చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.
దీంతో ఎమ్మెల్లేలంతా శాసన సభలో ఎవరు ఏం మాట్లాడారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకరిమీద ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ ఎమ్మెల్యేలు కాలం గడిపేస్తున్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేలంతా ఒకరిపై ఒకరు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు.
తెలంగాణలొ కమలం పార్టీ పరిస్థితి ఇతర పార్టీలకు భిన్నంగా తయారైంది. అసెంబ్లీ సమావేశాలు అనగానే ఇతర పార్టీల్లో మాట్లాడిన అంశాలపై ముందే శాసనసభాపక్ష సమావేశంలో కసరత్తు జరుగుతుంది. పార్టీ ముఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టే సెబ్జెక్ట్‌లకు సంబంధించి మెటీరియల్ అందించి ఎవరేం మాట్లాడాలో గైడ్ చేస్తుంటాయి.
సభలో ఎలా వ్యవహరించాలి, ఏయే అంశాలను లేవనెత్తాలనే విషయాలపై బ్రీఫింగ్ ఇస్తారు. కానీ కాషాయ పార్టీలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. రాష్ట్ర నాయకత్వం ఆ పని చేయలేక చేయలేక చేతులెత్తేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమే సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వగా బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించలేదు. తెలంగాణ కాషాయ పార్టీలో అధికార ప్రతినిధుల జాబితా చెప్పుకోవడానికి చాలా పెద్దగాదే ఉనప్పటికి… ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తే పార్టీ మైలేజ్ పెరుగుతుందో అన్నదానిపై మాత్రం గైడ్ చేయలేకపోతున్నారు.
పేరుకే అధికార ప్రతినిధులు కానీ పనేమీ లేకుండా మిగిలిపోతున్నారు. దాంతో కమలం పార్టీ నేతల్లో అంతర్గత విబేధాలు పెరుగుతున్నాయి. ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులను రాష్ట్ర నాయకత్వం సమర్ధంగా వాడుకోలేక పోతుండటం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్న రాష్ట్ర బీజేపీ పెద్దలు తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఓన్ చేసుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు రుణమాఫీపై హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఆ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతులు అంటూ విడుదల చేసిన పోస్టర్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పొటో తప్ప మిగతా ఎవరి ఫోటోలు కూడా ముద్రించలేదు.
బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి పార్టీలో కీలకమైంది. ఆ పదవిలో మహేశ్వర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కనీసం ఆయన ఫొటోకి కూడా పోస్టర్‌లో ప్లేస్ దక్కలేదు. దాంతో బీజేఎల్పీని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదని పార్టీ ఎమ్మెల్యేలే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి టీ బీజేపీలో ఏర్పడింది. గతంలొ కూడా ఈ అంతర్గత కుమ్ములాటల కారణంగా పార్టీకి చాలమంది కీలక నేతలు దూరమైన పరిస్థితులు ఉన్నాయి.
మొన్నటిదాక అంతర్గత విభేదాలతో రాష్ట్ర నాయకత్వం భారీగా నష్టపోతే, ఇప్పుడు శాసన సభ్యులు వర్సెస్ రాష్ట్ర నాయకత్వం మద్యల గ్యాప్ పెరుగుతుండటం బీజేపీ కేడర్‌ని కలవరపరుస్తోంది.కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించడంతో ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు.
ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం కూడా గాలికి వదిలేస్తుండటంతో ఎమ్మెల్యేలను గైడ్ చేసే వారే కరువయ్యారు. మరి ఈ పరిస్థితి ఎక్కడిదాక వెళ్తుందో.? ఆ పార్టీ జాతీయ నాయకత్వం అయినా ఇన్వాల్వ్ అయి సరిదిద్దుతుందో.? లేదో? చూడాలి.