2 లక్షల రుణమాఫీ కి ముహూర్తం ఖరారు…
ఖమ్మం : రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వైరాలో 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
కొంత మంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారని.. అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకుని మాఫీ చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. రైతు రుణమాఫీలో ఏది బాగోలేక పోయినా అందుకు గత ప్రభుత్వమే కారణం కారణమన్నారు.
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకోవడం కోసం రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఈ నెలలో మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు. రైతాంగ మనోధైర్యాన్ని దెబ్బతీయ వద్దని మంత్రి సూచించారు.
ఇప్పటి వరకు చేసిన రుణమాఫీలో 30 వేల ఖాతాల్లో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని ఆయన చెప్పారు. వాస్తవానికి రాహుల్ గాంధీ ప్రకటన చేసిన మే నెల నుంచే రుణమాఫీ చేయాల్సి ఉంది.
కానీ రైతులను దృష్టిలో పెట్టుకుని ఐదు సంవత్సరాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. పాస్ బుక్ లేకపోయినా తెల్ల రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకున్నామన్నారు.
ఇప్పటికే 17 వేల ఖాతాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించామని.. గతంలో అధికారంలో ఉండి ఏమి చేయలేని వారు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు మానుకోవాలన్నారు.
ఈసారి వరణుడు కరుణించాడని.. కృష్ణా బేసిన్‌కు చాలా రోజుల తర్వాత అన్ని ప్రాజెక్టులు నిండాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
గోదావరిలో కొంత లోటు ఉందని.. ఇంకా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోందన్నారు. అన్ని పంటలు వేసుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అన్ని బకాయిలు విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు.
రైతులకు అన్ని విత్తనాలు లోటు లేకుండా సరఫరా చేశారని.. కేంద్రం కొంత అనాసక్తిగా ఉన్నా ఎరువులకు ఇబ్బంది లేదన్నారు.
భవిష్యత్‌లో యూరియా, డీఏపీ గతంలో అనుకున్నంత కేంద్రం పంపలేదన్నారు. రాష్టానికి రావాల్సిన కోటా యూరియా, డీఏపీ కేంద్రం ఇవ్వలేదని మంత్రి వెల్లడించారు. కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్ర రైతులకు సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు.