ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువుల ఆరోపణ కాన్పు అయిన రోజే రక్తస్రావం కావడంతో బాలింత మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కంకల పద్మ(మంజుల)-ఐలయ్య దంపతుల రెండో కుమార్తె మానస(26)ను నాలుగేళ్ల క్రితం మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన కొల్లు మహేష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. మహేష్‌ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి …

ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి

బంధువుల ఆరోపణ

కాన్పు అయిన రోజే రక్తస్రావం కావడంతో బాలింత మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది.

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కంకల పద్మ(మంజుల)-ఐలయ్య దంపతుల రెండో కుమార్తె మానస(26)ను నాలుగేళ్ల క్రితం మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన కొల్లు మహేష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.

మహేష్‌ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి శ్రీశైనిత అనే మూడేళ్ల పాప ఉంది. మానస రెండోసారి గర్భం దాల్చగా.. రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో నెలనెలా పరీక్షలు చేయించుకుంటోంది.

ఈ నెల 4వ తేదీన కాన్పు కోసం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం 11గంటల సమయంలో వైద్యులు మానసకు ఆపరేషన్‌ చేసి కాన్పు చేయగా.. ఆడబిడ్డ పుట్టింది.

అదే రోజు సాయంత్రం నుంచి మానసకు రక్తస్రావం కావడంతో బీపీ పడిపోయి పరిస్థితి విషమించింది. రాత్రి 8గంటల సమయంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే మానస మృతిచెందింది. మానస మృతదేహాన్ని బంధువులు రాత్రి రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చారు.

న్యాయం చేయాలని ఆందోళన..

వైద్యులు నిర్లక్ష్యమే మానస మృతికి కారణమంటూ బంధువులు మానస మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉంచి రాత్రంతా ఆందోళన నిర్వహించారు. కలెక్టర్‌ వచ్చేంత వరకు ఆందోళన విరమించమని, మానస మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.

సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ పి. మల్లయ్యలు భారీ బంధోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల రకు డీసీహెచ్‌ఎస్‌ చిన్నూనాయక్‌, తహసీల్దార్‌ లాల్‌బహదూర్‌, సూపరింటెండెంట్‌ వీరన్న మంగళవారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు.

జరిగిన ఘటనపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక సమర్పి స్తామని, మానస కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని డీసీహెచ్‌ఎస్‌ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన నిర్వహించారు.

మృతురాలి భర్త మహేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి. మల్లయ్య తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

పాల కోసం తల్లడిల్లిన పసిబిడ్డ

మానస జన్మనిచ్చిన పసిబిడ్డ ఆకలితో అర్ధరాత్రి పాల కోసం ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది. బిడ్డకు పాలు ఇచ్చేందుకు ఒకరిద్దరు బాలింతలు ముందుకొచ్చినప్పటికీ వారి వద్దకు పాపను తీసుకెళ్లడానికి వీలుకాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మెడికల్‌ షాపులో పాల పౌడర్‌ను తెచ్చి పసిపాప ఆకలి తీర్చారు.

మానస అమ్మమ్మ ఊరు రామన్నపేట కాగా.. చదువుకునే రోజుల్లో సెలవుల్లో ఎక్కువగా ఆమె ఇక్కడే గడిపేది. దీంతో మానస మరణవార్త విని స్థానికులతో పాటు బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలిరావడంతో శోకసంద్రంగా మారింది.

Updated On 7 Aug 2024 10:31 AM IST
cknews1122

cknews1122

Next Story