వినేశ్ ఫొగట్ విషయంలో ఏం జరిగింది? ఆమె మోసం చేసిందా? ఒలింపిక్స్ ఫైనల్ బౌట్‌కి చేరుకున్న మొదటి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించిన వినేశ్ ఫొగట్ సంతోషం 12 గంటల్లో తల్లక్రిందులు అయ్యింది. నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంతో వినేశ్ ఫొగట్‌ను డిస్‌క్వాలిఫై చేయడమే కాకుండా.. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఐవోసీ ఆమెను ఆఖరు స్థానానికి పరిమితం చేసింది. సెమీస్‌లో వినేశ్ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్ …

వినేశ్ ఫొగట్ విషయంలో ఏం జరిగింది? ఆమె మోసం చేసిందా?

ఒలింపిక్స్ ఫైనల్ బౌట్‌కి చేరుకున్న మొదటి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించిన వినేశ్ ఫొగట్ సంతోషం 12 గంటల్లో తల్లక్రిందులు అయ్యింది. నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంతో వినేశ్ ఫొగట్‌ను డిస్‌క్వాలిఫై చేయడమే కాకుండా.. 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఐవోసీ ఆమెను ఆఖరు స్థానానికి పరిమితం చేసింది.

సెమీస్‌లో వినేశ్ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్ గుజ్‌మాన్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. పతకం గెలుస్తుందని భావించిన వినేశ్.. చివరకు రికార్డులన్నీ కోల్పోయి ఆఖరు స్థానానికి చేరింది.

అసలు ఆమె విషయంలో ఒలింపిక్ విలేజ్‌లో ఏం జరిగింది? ఓవర్ వెయిట్‌కు కారణం వినేశ్ ఫొగటా? సపోర్టింగ్ స్టాఫా? అనే చర్చ మొదలైంది. ఆమె అందరినీ మోసం చేసి 50 కేజీల విభాగంలో పోటీకి దిగిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

టీమ్ ఇండియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్‌షా పార్దీవాలా, కోచ్, న్యూట్రిషనిస్ట్, ఐవోఏ చీఫ్ పీటీ ఉష చెప్పిన దాని ప్రకారం.. ఇది సపోర్టింగ్ స్టాఫ్ తప్పే అని తెలుస్తున్నది.

రెజ్లింగ్‌లో ఏ ఈవెంట్ అయినా రెండు రోజుల్లో ముగిసిపోతుంది. అలాగే మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం మ్యాచ్‌లు మంగళ, బుధవారాలు షెడ్యూల్ చేశారు. ఈ రెండు రోజులు ఉదయం పూట వెయిట్-ఇన్ తప్పకుండా ఉంటుంది.

రెజ్లర్ నిర్దేశిత బరువు ఉన్నారా? లేదా? అని చెక్ చేస్తారు. సాధారణంగా ప్రపంచంలో ఏ రెజ్లర్ అయినా తన సాధారణ బరువు కంటే కాస్త తక్కువ ఉండే విభాగంలోనే పోటీ పడతారు. వినేశ్ ఫొగట్ మాత్రమే కాదు.. తన ప్రత్యర్థులు కూడా 50 నుంచి 51.99 కిలోల మధ్య ఉంటారు.

అయితే.. వెయిట్-ఇన్ కార్యక్రమానికి ముందు నుంచి రెజ్లర్లకు నీళ్లు, ఆహారం పెద్దగా ఇవ్వరు. వాళ్లు బరువు పెరగకుండా చూడాల్సిన బాధ్యత న్యూట్రిషనిస్ట్‌లదే. ఉదయం పూట కూడా ఒక సారి చెక్ చేసి.. బరువు తగ్గించడానికి సోనా-బాత్, ట్రెడ్‌మిల్, స్కిప్పింగ్ వంటివి చేయించి చెమటను బయటకు పంపుతారు. సాధారణంగా మన తాగే నీళ్లు ఒంటి బరువును విపరీతంగా పెంచుతాయి.

ఒక అరలీటరు నీళ్లు బయట పావు కిలో బరువు ఉంటాయని అనుకుంటే.. తాగి శరీరంలోకి వెళ్లిన తర్వాత అది కనీసం ముప్పావు కిలో బరువును పెంచుతుంది. అందుకే వెయిట్-ఇన్‌కు ముందు కనీసం నీళ్లు కూడా తాగించరు. ఒక సారి వెయిట్‌-ఇన్‌లో నిర్దేశిత బరువు ఉంటే.. అప్పుడు బౌట్‌లకు ముందు శక్తి కోసం హై ఎనర్జీ ఫుడ్, నీళ్లు తీసుకుంటారు. ఇదంతా న్యూట్రిషనిస్ట్‌ల పర్యవేక్షణలో జరుగుతుంది.

మంగళవారం వెయిట్-ఇన్ సమయంలో సరైన బరువే ఉన్న వినేశ్ ఫొగట్.. బౌట్‌కు ముందు ఎనర్జీ ఫుడ్ తీసుకుంది. బౌట్ సమయంలో నీళ్లు తాగింది. మొత్తంగా నిన్న 1.5 కేజీల న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నట్లు తెలిసింది. బౌట్ తర్వాత కోచ్ వెయిట్ చూస్తే.. చాలా ఎక్కువగా కనిపించింది.

అయితే న్యూట్రిషనిస్ట్ మాత్రం ఉదయం కల్లా తగ్గిస్తానని కాన్ఫిడెంట్‌గా చెప్పినట్లు డాక్టర్ దిన్‌షా పార్దీవాలా వెల్లడించారు. అయితే నిన్న సాయంత్రం బౌట్‌కు ఇవ్వాళ వెయిట్-ఇన్‌కు మధ్య సమయం చాలా తక్కువగా ఉండింది. ఉదయం 7.15 నుంచి 7.30 మధ్య వెయిట్-ఇన్ చేయాల్సి ఉండగా.. రాత్రంతా హార్డ్ ఎక్సర్‌సైజ్‌లు చేశారు.

నీళ్లు తీసుకోకుండా సోనా బాత్ వంటివి చేసింది. చివరి క్షణంలో వెయిట్ తగ్గించడానికి హెయిర్ కట్ చేశారు. జెర్సీ కొలతలు కూడా తగ్గించారు. కానీ 100 గ్రాములు ఎక్కువగానే ఉన్నది. మరో గంట సేపు సమయం అడిగినా.. ఐవోసీ ఇవ్వలేదు. దీంతో వినేశ్ ఫొగట్ డిస్‌క్వాలిఫై అవక తప్పలేదు.

వినేశ్ ఫొగట్‌ను పర్యవేక్షించిన డైటీషియన్ కమ్ న్యూట్రిషనిస్ట్ తప్పుగా అంచనా వేయడమే కాకుండా.. కొన్ని గంటల్లోనే బరువు తగ్గించగలనని భావించాడు. బౌట్‌కు ముందు తీసుకున్న ఆహారం.. మూడు వరుస బౌట్ల కారణంగా వెయిట్ పెంచి ఉండదని అనుకున్నాడు.

అందుకే బౌట్‌ల సమయంలో నీళ్లు కూడా ఎక్కువగా తాగించాడు. తీరా రాత్రి బరువు చూస్తే.. చాలా ఎక్కువగా ఉంది. పొద్దున కల్లా తగ్గిస్తాననే భ్రమలో.. సాధారణంగా చేసే కంటే కాస్త హార్డ్ ఎక్సర్‌సైజులే మామూలుగా చేయించారు. కానీ ఉదయం బరువు తగ్గలేదని తెలిసి హడావిడి చేసినట్లు సమాచారం. చివరకు 52.01 కేజీల వద్ద వినేశ్ బరువు తూగింది.

ఇందులో వినేశ్ తప్పు ఏ మాత్రం లేదని.. బరువు పెరగడం, తగ్గించడం అనేది పూర్తిగా సపోర్ట్ స్టాఫ్ బాధ్యతే అని డాక్టర్ దిన్‌షా పార్దీవాలా చెప్పారు. పీటీ ఉష కూడా ఈ విషయంలో తన విచారం వ్యక్తం చేశారు.

తప్పు ఎవరిది అయినా.. వినేశ్‌కు జరిగిన దానిపై తాను చాలా దిగ్భ్రాంతి చెందానని అన్నారు. ఇకపై అథ్లెట్లు బరువు విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇక వినేశ్ ఇవ్వాళ తీవ్ర అస్వస్థకు గురయ్యారనేది అవాస్తవమే. ఆమె బరువు తగ్గడానికి నీళ్లు తాగక పోవడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. సాధారణంగా రెజ్లర్లు బౌట్స్ తర్వాత డీహైడ్రేషన్‌కు గురవుతారు.

వెంటనే శక్తి కోసం ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు. ఫోగట్ కూడా ఉదయం వెయిట్-ఇన్ తర్వాత వీక్‌గా ఉండటంతో ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు పీటీ ఉష చెప్పారు.

Inputs : ఒలింపిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లోనే నిన్న, ఈ రోజు ఏం జరిగిందో తెలిపారు. దీంతో పాటు రాయిటర్స్, ఏపీ వంటి న్యూస్ ఏజెన్సీలు ప్యారీస్‌లో ఏం జరిగిందో రిపోర్టు చేశాయి.

Updated On 7 Aug 2024 9:21 PM IST
cknews1122

cknews1122

Next Story