కండక్టర్ ఉద్యోగానికి ఎసరు పెట్టిన ఉచిత బస్సు పథకం..
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఉచిత బస్సు పథకం ఓ కండక్టర్ ఉద్యోగానికి ఎసరు పెట్టింది.బస్సులో సీటు విషయంలో జరిగిన వాగ్వాదం తీరా.. ఒక ఉద్యోగిని తొలగించేందుకు పై అధికారి వెనుకాడని స్థితికి తీసుకెళ్లింది.
ప్రయాణికురాలి ఫిర్యాదుతో ఎలాంటి విచారణ జరుపకుండా డిపో మేనేజర్ కండక్టర్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు మెమో జారీ చేయడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ – జనగామ బస్సులో ఓ గర్భిణికి సీటు ఇవ్వాలని కండక్టర్ మరో మహిళను అడిగాడు. దీంతో కోపగించుకున్న ఆ మహిళ నన్ను సీటులోంచి లేవమనేందుకు నువ్వెవరు అంటూ కండక్టర్ తో గొడవకు దిగింది. కండక్టర్ మీద మండిపడుతూ బస్సులోంచి మధ్యలోనే దిగిపోయింది.
ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. జనగామా డిపో మేనేజర్ స్వాతి ఎలాంటి విచారణ జరుపకుండానే సదరు కండక్టర్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు మెమో జారీ చేశారు. ఒక ఫిర్యాదు అందగానే విధుల్లోంచి ఎలా తొలగిస్తారు? ఇదెక్కడి కొత్త రూల్? విచారణ జరపరా?
ఆరోపణలు వస్తే విధుల నుంచి తొలగిస్తరా అంటూ జనగామా సిబ్బంది, ఆర్టీసీ యూనియన్లు జనగామా డిపోముందు ధర్నాకు దిగారు. ఉచిత బస్సు పథకం వల్లనే ఇలా జరిగిందని.. అసలు రాష్ట్రంలో ఉచిత బస్సు పెట్టినప్పటి నుంచి రోజూ బస్సుల్లో గొడవలు జరుగుతున్నాయని స్వయంగా మహిళలే వాపోతున్నారు.